వారికి సెలవులు లేనట్లే

సహాయక చర్యల కోసం 040-2111 1111 లేదా.. 9000113667 కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా

Update: 2023-07-26 03:15 GMT

భారీ వర్షానికి హైదరాబాద్ నగర వాసులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. హైదరాబాద్ కు బుధ, గురువారాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మంగళవారం కురిసిన వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలు కాలనీల్లో వరద నీరు చేరింది. డ్రైనేజీలన్నీ పొంగిపొర్లుతున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహానికి హుస్సేన్​సాగర్​ ​నిండుకుండను తలపిస్తోంది. నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే నదీ పరివాహక ప్రాంతాల ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. టోలీచౌకీలోని పలు ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. శాతం చెరువుకు గండికొట్టి నీటిని మూసీలోకి వదులుతున్నారు. వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అప్రమత్తం అయింది. డీఆర్ఎఫ్‌ బృందాలను సిద్దం చేసింది.

భారీ వర్షాలకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి తెలిపారు. జోనల్‌ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్ల పరిధిలో పనిచేసే అధికారులకు, సిబ్బందికి అత్యవసరం అయితే తప్ప సెలవులు ఇవ్వవద్దని మేయర్‌ ఆదేశాలు జారీ చేశారు. నగరంలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో నివాసితులు ఎలాంటి ఇబ్బంది లేకుండా నీరు నిలువకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. మాన్‌సూన్‌ ఎమర్జెన్సీ బృందాలు 428 ఏర్పాటు చేసిన నేపథ్యంలో రోడ్లపై నిలిచిన నీటిని వెనువెంటనే తొలగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. భారీ వర్షాలు ఉన్నందున అత్యవసర పనులు ఉంటేనే బయటకు రావాలని నగర వాసులకు సూచించారు. సహాయక చర్యల కోసం 040-2111 1111 లేదా.. 9000113667 కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌లోకి క్రమంగా వరద ఉధృతి పెరుగుతోంది. హిమాయత్‌సాగర్‌లోకి 2500 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా నాలుగు గేట్లు రెండు అడుగుల మేర ఎత్తి 2750 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదులుతున్నారు. ఉస్మాన్‌సాగర్‌లోకి 1100 క్యూసెక్కుల నీరు వస్తుండగా గరిష్ఠ స్థాయి నీటి మట్టానికి ఇంకా రెండున్నర అడుగుల మేర రావాల్సి ఉంది. గరిష్ఠ స్థాయి నీటి మట్టానికి చేరువ కాగానే ఈ రిజర్వాయర్‌ నుంచి దిగువ మూసీలోకి వరద నీటిని పంపించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.


Tags:    

Similar News