సిగాచీ పరిశ్రమ పేలుడుకు రియాక్టర్ కారణం కాదా? అసలు రీజన్ అదేనా?

సిగాచీ పరిశ్రమలో పేలుడు ఘటన కార్మికుల కుటుంబాల్లో విషాదం నింపింది. ఇప్పటివరకూ నలభై మంది కార్మికులు చనిపోయారు

Update: 2025-07-03 01:38 GMT

సిగాచీ పరిశ్రమలో పేలుడు ఘటన కార్మికుల కుటుంబాల్లో విషాదం నింపింది. ఇప్పటివరకూ నలభై మంది కార్మికులు చనిపోయారు. మరో ముప్ఫయి మది వరకూ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారు భవిష్యత్ లో ఏ పనిచేయలేని వారు అనేక మంది ఉన్నారు. కొందరు స్వల్పగాయాలతో బయటపడగా, మరికొందరు ఇంకా చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. గాయపడిన వారు కోలుకునేందుకు కొన్ని నెలలు సమయం పట్టే అవకాశముంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. శరీరంలో ఎనభై శాతం కాలిన గాయాలతో ఉన్న వారిలో కొందరి పరిస్థితి విషమంగానే ఉంది. 36 మంది ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఇంకా ఆచూకీ తెలియని...
కొందరు కార్మికుల ఆచూకీ ఇంకా తెలియడం లేదు.దాదాపు తొమ్మిది మంది కార్మికులు ఎక్కడ ఉన్నారన్నది తెలియక బంధువులు ఆందోళన చెందుతున్నారు. మరొకవైపు తప్పిపోయిన కార్మికులు భవనాల శిధిలాల కింద ఉంటారని అధికారులు భావిస్తున్నారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. శిధిలాలను తొలగిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకూ అవరవై మంది కార్మికులు ఆచూకీ మాత్రమే లభించిందని సిగాచీపరిశ్రమ యాజమాన్యం చెబుతుంది. మరొకవైపు కంపెనీ యాజమాన్యం కూడా రంగంలోకి దిగింది. మృతుల కుటుంబాలు ఒక్కొక్కరికి కోటి రూపాయల పరిహారాన్ని ప్రకటించింది. గాయపడిన వారికి తామే కోలుకునేంత వరకూ చికిత్స అందిస్తామని తెలిపింది. సిగాచీ కంపెనీని మూడు నెలల పాటు మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది.
పాత మిషనరీ వల్లనేనా?
ప్రమాదానికి రియాక్టర్ పేలుడు కారణం కాదని యాజమాన్యం కూడా చెబుతుంది. అయితే పాత మిషనరీ వాడకం వల్లనే పేలుడు జరిగిందని కార్మిక కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. కంపెనీ యాజమాన్యంపై పోలీస్ స్టేషన్ లో కార్మికుల కుటుంబాల ఫిర్యాదుతో కేసు నమోదయింది. కొన్ని దశాబ్దాల నుంచి పాత మిషనరీ వాడటం వల్ల, మిషనరీని ఆధునికీకరించకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందనిచెబుతున్నారు. మరొక వైపు ప్రభుత్వం ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది.
నిపుణుల కమిటీ నివేదిక...
నిపుణుల కమిటీ పేలుడుకు గల కారణాలను తెలుసుకుని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా కాలి పోవడంతో డీఎన్ఏ పరీక్షల ఆధారంగా బంధువులకు అప్పగించే పనిని ప్రారంభించారు.ప్రమాదం జరిగినప్పుడు 143 మంది విధులు నిర్వహిస్తున్నారని కంపెనీ యాజమాన్యం తెలిపింది. పర్మినెంట్ కార్మికులు కొందరు కాగా, కాంట్రాక్టు కార్మికులు కూడా ఈ కంపెనీలో పనిచేస్తున్నారు. సిగాచీ పరిశ్రమ సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నంలో నిపుణుల కమిటీ ఉంది.


Tags:    

Similar News