Hyderabad : న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే జాగ్రత్త
హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకలకు అంతా సిద్ధమయింది. అయితే న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలను విధించారు
హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకలకు అంతా సిద్ధమయింది. అయితే న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలను విధించారు. ఈవెంట్ నిర్వాహకులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అనుమతి లేకుండా ఈవెంట్లు నిర్వహిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఈవెంట్స్ లో అశ్లీల నృత్యాలు నిషిద్ధమని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈవెంట్ జరిగే ప్రాంతంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని పోలీసులు తెలిపారు. అంతేకాదు అవుట్ డోర్ లో ఈవెంట్ లు నిర్వహిస్తే లౌడ్ స్పీకర్లను రాత్రి పది గంటల తర్వాత ఆఫ్ చేయాలని తెలిపారు. డీజీల సౌండ్ బయటకు వస్తే లోపల తోసేస్తామని హెచ్చరించారు. దీంతోపాటు బార్లు, మద్యందుకాణాలు ఎక్సైజ్ శాఖ నిబంధనలకు అనుగుణంగానడుచుకోవాలన్నారు.
సామర్థ్యాన్నిబట్టి...
న్యూ ఇయర్ వస్తుందంటే డిసెంబరు 31వ తేదీ రాత్రి హైదరాబాద్ నగరంలో అనేక ఈవెంట్లు జరుగుతుంటాయి. మద్యం ఏరులై పారుతుంది. ఈవెంట్ ను నిర్వహించే సంస్థలు ఫుడ్, మద్యం తో పాటు వినోద కార్యక్రమాలను కూడా పెద్దయెత్తున ప్రతి ఏడాది ఏర్పాటు చేస్తుంటాయి. అయితే విపరీతమైన క్రౌడ్, హాలు సామర్థ్యానికి, గ్రౌండ్ లో పట్టని విధంగా టిక్కెట్లు జారీ చేసినా పోలీసులు చర్యలు తీసుకుంటారు. గ్రౌండ్ ఎంత ఉంది? ఎంత మందిని ఈవెంట్ కు ఆహ్వానించాలన్నది నిర్ణయించిన తర్వాత మాత్రమే అనుమతులు మంజూరు చేస్తారు. నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ మందిని ఈవెంట్ కు అనుమతిస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు.
పది గంటల నుంచి పరీక్షలు...
అదే సమయంలో హైదరాబాద్ నగరంలో డిసెంబరు 31వ తేదీ రాత్రికి మద్యం దుకాణాలు రాత్రి ఒంటి గంట వరకూ ఎక్సైజ్ శాఖ అనుమతిస్తుంది. బార్లు కూడా పన్నెండు గంటల వరకూ తెరిచి ఉంచే వీలుంది. అయితే మద్యం తాగి వాహనాలను నడిపితే మాత్రం చర్యలు తీసుకుంటామని పోలీసు శాఖ హెచ్చరించింది. అడుగడుగనా బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ లను నిర్వహిస్తామని చెప్పింది. మద్యం తాగి వాహనాలతో రోడ్డు మీదకువచ్చే వారిని వదిలి పెట్టే ప్రసక్తి లేదంటూ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఎక్కువ రోడ్డు ప్రమాదాలు ప్రతిఏడాది జరుగుతుండటంతో పోలీసులు ముందుగానే హెచ్చరికలను జారీ చేస్తున్నారు. యువత మద్యం తాగి రోడ్డు మీదకు వాహనాలతో రావద్దని హెచ్చరించారు.