Sigachi Industry Accident : వారు ఇక చనిపోయినట్లే.. ఆధారాలు దొరకలేదు.. చేతులెత్తేసిన అధికారులు
పాశమైలారంలో సిగాచీ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో గల్లంతయిన ఎనిమిది మంది కార్మికులు మరణించారని అధికారులు ధృవీకరించారు
పాశమైలారంలో సిగాచీ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో గల్లంతయిన ఎనిమిది మంది కార్మికులు మరణించారని అధికారులు ధృవీకరించారు. వారు బతికే అవకాశాలు లేవని అధికారుల తేల్చారు. ప్రమాదం జరిగిన సమయంలో తప్పించుకోలేక కాలి బూడిదయి పోయి ఉంటారని అధికారులు నిర్ణయానికి వచ్చారు. గత పదకొండు రోజుల నుంచి సిగాచీ పరిశ్రమ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయినా ఎటువంటి ఆధారాలు లభించలేదు. కొద్దిపాటి మానవ శరీరభాగాలు లభించినప్పటికీ వాటితో కుటుంబీకుల డీఎన్ఏతో సరిపోవడం లేదు. దీంతో అధికారులు ఇక ఆ ఎనిమిది మంది ఇక జీవించి ఉండేఅవకాశంలేదని బంధువులకు అధికారులు తేల్చిచెప్పారు.
నలభై నాలుగు మంది మృతి...
సిగాచీ పరిశ్రమ ప్రమాదంలో మొత్తం నలభై నాలుగు మంది చనిపోయారు. సుమారు 66 మంది ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మరో పదహారు మంది చావు బతుకుల మధ్య ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఎంత మంది బతికి బయటకు వస్తారో తెలియదు. అయితే ఎనిమిది మంది జాడ మాత్రం ఇంతవరకూ తెలియరాలేదు. వీరిని రాహుల్, శివాజీ, వెంకటేశ్, విజయ్, అఖిలేష్, జస్టిన్, రవి, ఇర్ఫాన్ లు గా గుర్తించారు. వీరంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వారితో పాటు తెలంగాణకు చెందిన వారు కూడా ఉన్నారు. అయితే వీరి బంధువులు మాత్రం ప్రమాదం జరిగిన నాటి నుంచి అక్కడే తమ వారి ఆచూకీ కోసం పడిగాపులు కాస్తున్నారు.
స్వస్థలాలకు వెళ్లిపోవాలని...
అయితే ఆ ఎనిమిది మంది ఆచూకీ ఇక లభించడం కష్టమేనని అధికారులు నిర్ణయానికి వచ్చి కుటుంబ సభ్యులను వారి స్వస్థలాలకు వెళ్లాలని సూచించారు. ఏదైనా సమాచారం ఉంటే తెలియజేస్తామని, ఇక్కడ ఉండి అనవసరంగా సమయాన్ని వృధా చేసుకోవద్దని సూచించారట. ఈ మేరకు వారు జీవించే అవకాశం ఎంత మాత్రం ఉండదని, ఏదైనా ఆచూకీ లభిస్తే తెలియజేస్తామని, వారి రక్తనమూనాలు సేకరించి పంపించి వేశారు. డీఎన్ఏ గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుంది. అప్పటి వరకూ ఇక్కడ ఉండటం వేస్ట్ అని చెప్పడంతో జాడతెలియని ఎనిమిది కార్మికుల కుటుంబ సభ్యులు ఉండాలా? వెళ్లాలా? అన్నది తెలియక సందేహంలో ఉన్నారని తెలిసింది.