Sigachi Chemical Industry Accident :పత్లాలేని సిగాజీ యాజమాన్యం..ఇరవై నాలుగు గంటలయినా రాకపోవడమేంటి?
పాశమైలారంలోని సిగాచీ రసాయన పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య నలభైకి దాటింది
పాశమైలారంలోని సిగాచీ రసాయన పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య నలభైకి దాటింది. నలభై మూడు మంది ఆచూకీ కనిపించడం లేదు. అయినా పరిశ్రమ యాజమాన్యం ఇంత వరకూ పరిశ్రమ వద్దకు రాలేదు. ప్రమాదం జరిగి ఇరవై నాలుగు గంటలు గడుస్తున్నా యాజమాన్యం మాత్రం కంపెనీ పరిసర ప్రాంతాల్లోకి రాలేదు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్వం చేశారు. నిన్న ఉదయం ప్రమాదం జరిగి నలభై మంది వరకూ మరణించి, నలభై మూడు మంది వరకూ మిస్ అయితే యాజమాన్యం ఎందుకు రాలేదని నిలదీశారు. కార్మికులు ప్రమాదానికి గురై ఇంత విపత్తు సంభవించినప్పటికీ రాకపోవడానికి కారణాలేంటి అని ప్రశ్నించారు.
తప్పించుకుని తిరుగుతూ...
అయితే ప్రస్తుతం సిగాచీ పరిశ్రమలోని ఉన్నతాధికారులతో యాజమాన్యం చర్చలు జరుపుతుంది. కార్మికులకు జీవిత బీమా సౌకర్యం ఉందని చెబుతున్నారు. గాయపడి చికిత్స పొందుతున్న వారి వైద్య ఖర్చులన్నీ ఎవరి అనుమతులు లేకుండానే తాము ఖర్చు చేస్తామని అక్కడ పరిశ్రమకు చెందిన అధికారులు చెబుతున్నారు. యాజమాన్యం పత్తా లేకుండా పోవడానికి గల కారణాలపై చర్చ జరుగుతుంది. ఇంత బీభత్సమైన ఘోరమైన ప్రమాదం జరిగినప్పటికీ తప్పించుకు తిరగడం ఏంటని పలువురు కార్మిక కుటుంబాలు ప్రశ్నిస్తున్నాయి. మృతి చెందిన కార్మికుల కుటుంబ సభ్యలు వారిపై దాడికి దిగే అవకాశముందని భయపడి ఈ ప్రాంతానికి రాలేదని కుంటి సాకులు చెబుతున్నారు.
పరిహారం ఎవరిస్తారు? ఎంతిస్తారు?
కానీ ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవడంతో పాటు రియాక్టర్ పేలుడువల్లనే జరిగిందా? లేక మరేదైనా కారణమా? అన్నది తేల్చడానికి కూడా యాజమాన్యం ముందుకు రావాలని కార్మిక కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. పరిశ్రమ యాజమాన్యమే ఈ ప్రమాదానికి బాధ్యత వహించాలని ప్రభుత్వం కూడా గట్టిగా చెబుతుంది. మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి పరిహారం కూడా పెద్ద స్థాయిలో ఉండేలా చూసేందుకు యాజమాన్యంతో చర్చించాలంటే వారు రాకుంటే ఎలా సాధ్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం మాట్లాడాలంటే ఎవరిని సంప్రదించాలి? అని రేవంత్ రెడ్డి సీరియస్ గానే ప్రశ్నించారు. పరిహారంపై ఎవరు డిసైడ్ చేస్తారంటూ నిలదీశారు. మొత్తం మీద ఇంత మంది ప్రాణాలు పోయినా యాజమాన్యం రాకపోవడం పట్ల నిరసన వ్యక్తమవుతుంది.