Hyderabad : హైదరాబాద్ లో భారీ వర్షం.. తడిసి ముద్దవుతున్న నగరం
హైదరాబాద్ లో భారీ వర్షం పడుతుంది. మొంథా తుపాను ప్రభావం హైదరాబాద్ పైన కూడా పడుతుంది
హైదరాబాద్ లో భారీ వర్షం పడుతుంది. మొంథా తుపాను ప్రభావం హైదరాబాద్ పైన కూడా పడుతుంది. హైదరాబాద్ నగరంలో పలు చోట్ల భారీ వర్షం పడుతుంది. హైదరాబాద్ వాతావరణ శాఖ ఇప్పటికే కొన్ని జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరికలు జారీ చేసింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. మొంథా తుపాను ప్రభావం ఇప్పుడిప్పుడే హైదరాబాద్ లో కనిపిస్తుంది.
సాయంత్రం నుంచి వర్షం...
మాదాపూర్, జూబ్లీహిల్స్, కొండాపూర్, బంజారాహిల్స్, మొహిదీపట్నం, టోలిచౌకి, లక్డీకాపూల్, అమీర్ పేట్, కూకట్ పల్లి, చందానగర్, మియాపూర్, ఆబిడ్స్, మలక్ పేట్, దిల్ సుఖ్ నగర్, సరూర్ నగర్, ఎల్బీ నగర్, హయత్ నగర్, ఉప్పల్, సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, ఏఎస్ రావు నగర్ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఉదయం నుంచి చిరుజల్లులు కురుస్తున్నప్పటికీ సాయంత్రానికి వాతావరణం హైదరాబాద్ లో ఒక్కసారిగా మారిపోయింది. సాయంత్రం నుంచి భారీ వర్షం మొదలయింది. దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి.
అధికారులు అప్రమత్తం...
నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రజలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులు అప్రమత్తం చేశారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలతో ప్రభుత్వం కూడా అప్రమత్తమయింది. మ్యాన్ హోల్స్ మూతలను ఎవరూ తెరవవద్దని, రహదారులపై నీరు నిలిస్తే జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నెంబరుకు కాల్ చేయాలని సూచించారు. ఈరోజు, రేపు భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అదే సమయంలో పురాతన భవనాల్లో నివసించే వారు కూడా అలెర్ట్ గా ఉండాలని హెచ్చరించారు.