Hyderabad : విజయలక్ష్మి ఛెయిర్ కు ఎసరు వచ్చినట్లేనా? బీజేపీ రూటు ఎటు?

హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పై అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతుంది.

Update: 2025-01-22 05:56 GMT

హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పై అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతుంది. అయితే అవిశ్వాస తీర్మానం పెడితే బీజేపీ నిర్ణయం ఎలా ఉంటుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత బీఆర్ఎస్ హయాంలో అంటే 2020లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక స్థానాలను సాధించింది. దీంతో కేసీఆర్ అప్పట్లో తనకు అత్యంత సన్నిహితుడైన కే. కేశవరావు కుమార్తె విజయలక్ష్మిని మేయర్ గా ఎంపిక చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బీజేపీ కూడా అత్యధికస్థానాలను సాధించింది.

అవిశ్వాసం పెట్టాలని...
బీఆర్ఎస్ కార్పొరేటర్‌గా గెలిచి.. జీహెచ్ఎంసీ మేయర్‌ పీఠం అధిష్టించిన గద్వాల్ విజయలక్ష్మీపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగా ఆ పార్టీ అగ్రనేతలు.. మంగళవారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. మొత్తం 150 డివిజన్లకు జరిగిన ఎన్నికల్లో 55 డివిజన్లలో బీఆర్ఎస్ గెలిచింది. 48 డివిజన్లలో బీజేపీ విజయం సాధించింది. 44 డివిజన్లలో ఎంఐఎం, రెండు స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే 2023లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన గద్వాల్ విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. దీంతో పాటు కొందరు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో కాంగ్రెస్ బలం 19కి చేరింది.
ఇద్దరూ ఒక్కటవ్వడంతో...
అయితే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్, ఎంఐఎం ఒక్కటయ్యాయి. దీంతో కాంగ్రెస్ అధికారికంగానే ఎంఐఎం మద్దతుతో 44 స్థానాల్లో విజయం సాధించింది. అయితే సంఖ్యా పరంగా చూసుకుంటే కాంగ్రెస్, ఎంఐఎం కలిస్తే మాత్రం ఓకే. కలవకుంటే మాత్రం బీఆర్ఎస్ ఎక్స్ అఫిషియో మెంబర్లతో కొంత నేటికీ బలంగానే కనిపిస్తుంది. అయితే అవిశ్వాస తీర్మానం పెడితే నెగ్గుతుందా? లేదా? అన్న అనుమానం బీఆర్ఎస్ నేతల్లో కనిపించడంవల్ల ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి కేటీఆర్ కీలక సమావేశం పెట్టారు. అవిశ్వాసం తీర్మానం పెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. తమకు అవసరమైన సభ్యుల బలం సమకూర్చుకోవడంపై వారు సమాలోచనలు చేసినట్లు తెలిసింది.
ఎంఐఎం రూట్ పక్కా...
అయితే ఎంఐఎం రూట్ పక్కా. అది కాంగ్రెస్ కు మద్దతుగా నిలుస్తుంది. అంటే గద్వాల్ విజయలక్ష్మి వైపు ఉంటుంది. మరో వైపు మొన్నటి శాసనసభ ఎన్నికల్లో ఎంఐఎం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రమే నగరంలో ఎక్కువ మంది గెలిచారు. దీంతో వారి ఓటు కూడా కీలకం కానుంది. వారిలో కూడా కొందరు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో మేయర్ గద్వాల్ విజయలక్ష్మిపై అవిశ్వాసం పెడితే బీజేపీ ఏం చేస్తుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బీఆర్ఎస్ కు మద్దతిస్తుందా? లేక కాంగ్రెస్ వైపు నిలుస్తుందా? ఎటు చేసినా నష్టమే. అందుకే అవిశ్వాస తీర్మానంలో బహిష్కరించడానికే బీజేపీ నిర్ణయం తీసుకుంటుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద కేటీఆర్ అండ్ గద్వాల్ విజయలక్ష్మి కుర్చీకి ఎసరు పెట్టేందుకు మాత్రం వ్యూహరచన ప్రారంభించారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.


Tags:    

Similar News