Bird Flu Effect : బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తో భారీగా పడిపోయిన బిర్యానీ ఆర్డర్లు

బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ కేవలం చికెన్ అమ్మకాలు చేసే వారికి మాత్రమే పరిమితం కాలేదు. ప్రధానంగా ఫుడ్ బిజినెస్ పై భారీగా పడింది

Update: 2025-02-18 04:01 GMT

బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ కేవలం చికెన్ అమ్మకాలు చేసే వారికి మాత్రమే పరిమితం కాలేదు. ప్రధానంగా ఫుడ్ బిజినెస్ పై భారీగా పడింది. సాధారణంగా చికెన్ బిర్యానీని ఎక్కువ మంది ఇష్టంగా తింటుంటారు. హోటల్ కు వెళ్లినా తొలుత ఆర్డర్ చేసేది చికెన్ ఐటమ్స్ కే తొలి ప్రాధాన్యత ఇస్తారు. అయితే బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తో చికెన్ తినాలనుకునే వారు సయితం నోటిని అదుపులో పెట్టుకుని ఇతర ఆహారం వైపు మళ్లుతున్నారని రెస్టారెంట్ల యాజమాన్యం చెబుతుంది. నిజానికి తెలంగాణలో బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ లేదు. కేవలం ఆంధ్రప్రదేశ్ లో నే ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండటం, లక్షల సంఖ్యలో కోళ్లు చనిపోతుండటంతో జిల్లాల సరిహద్దుల్లో నిఘాను ఏర్పాటు చేసి ఏపీ నుంచి కోళ్లను రాకుండా చేస్తున్నారు.

తెలంగాణలోనూ...
అయినా సరే తెలంగాణలోనూ ఆ ఎఫెక్ట్ కనిపిస్తుంది. చికెన్ దుకాణాలు బోసి పోయి కనిపిస్తున్నాయి. తెలంగాణలో మాంసాహార ప్రియులు ఎక్కువ. ముక్క లేనిదే ముద్ద దిగని వారు అనేక మంది ఉన్నారు. అలాంటి హైదరాబాద్ నగరంలోనే చికెన్ బిర్యానీల సేల్స్ దారుణంగా తగ్గిపోయిందని గణాంకాలు చెబుతున్నాయి. చికెన్ అంటే అందరూ ఇష్టపడతారు. హైదరాబాద్ బిర్యానీ ఫేమస్ కావడంతో పాటు చికెన్ అంటేనే మక్కువ పడే వారు ఎక్కువ మంది ఉన్నప్పటికీ గత కొద్ది రోజుల నుంచి హైదరాబాద్ నగరంలో చికెన్ బిర్యానీ అమ్మకాలు అస్సలు ఉండటం లేదని వ్యాపారులు వాపోతున్నారు. చికెన్ తినాలంటేనే భయపడే స్థితిని కల్పించడం వల్లనే ఈ పరిస్థితి ఎదురయిందని వ్యాపారులు చెబుతున్నారు.
స్విగ్గీ ఆర్డర్లలో...
మరోవైపు స్విగ్గీ ఆర్డర్లలో అగ్రభాగాన చికెన్ బిర్యానీ ఉంటుంది. బిర్యానీ అమ్ముడు పోయే వాటిలో 90 శాతం చికెన్ బిర్యానీ ఉంటుంది. అలాంటిది గత నాలుగు రోజులు నుంచి స్విగ్గీ, జొమాటో నుంచి చికెన్ బిర్యానీలు ఆర్డర్ చేసే వారి సంఖ్య ఎనభై శాత మేరకు పడిపోయిందని చెబుతున్నారు. జిహ్వచాపల్యం చంపుకోలేని వారు మటన్ బిర్యానీ, ఫిష్, ఫ్రాన్స్ బిర్యానీ లు మాత్రమే కొందరు ఆర్డర్లు చేస్తున్నారు. అయితే బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ లేదని పశువైద్యాధికారులు చెబుతున్నప్పటికీ ప్రజలు మాత్రం మనసులో భయంతో చికెన్ తినడానికి జంకుతున్నారు. హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని ప్రధాన నగరాల్లోనూ చికెన్ సేల్స్ 70 శాతం పడిపోయినట్లు అంకెలు చెబుతున్నాయి.


Tags:    

Similar News