BRS : కాంగ్రెస్ జోరుకు కారు బ్రేకులు.. వ్యూహం అదిరిందిగా?
భారత రాష్ట్ర సమితి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి మగంటి సునీతను అభ్యర్థిగా నిలబెట్టాలని దాదాపుగా నిర్ణయించింది.
భారత రాష్ట్ర సమితి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి మగంటి సునీతను అభ్యర్థిగా నిలబెట్టాలని దాదాపుగా నిర్ణయించింది. ఇంకా అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, పార్టీ ఇప్పటికే సునీతను చురుకుగా ప్రచారం చేయమని కోరినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇతర సీనియర్ నేతలతో కలిసి సునీత పార్టీ కార్యకర్తల సమావేశాల్లో, బుధవారం రహ్మత్‌నగర్ డివిజన్‌లో జరిగిన సమావేశంలో వేదిక పంచుకోవంతో ఈ ప్రచారం నిజమేనని భావించాల్సి వస్తుంది. మాగంటి గోపీనాధ్ ఆకస్మిక మరణంతో త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. దీంతో ఆయన కుటుంబంలోని వారికే టిక్కెట్ కేటాయించాలని బీఆర్ఎస్ దాదాపుగా నిర్ణయించింద.ి
ప్రజలతో మాగంటి కుటుంబానికి...
సెంటిమెంట్ తో పాటు మాగంటి గోపీనాధ్ కు నియోజకవర్గం ప్రజలతో ఉన్న అనుబంధంతో మాగంటి సునీతను అభ్యర్థిగా నిలబెడితే ఖచ్చితంగా గెలుస్తామన్న అభిప్రాయంలో గులాబీ పార్టీ నేతలున్నారు. ముఖ్యంగా మహిళ ఓటర్లతో పాటు ఒక సామాజికవర్గం ఓట్లు కూడా మాగంటి సునీతకు గంపగుత్తగా వచ్చి పడతాయని ఆశిస్తుంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరుల ఓట్లు కూడా మాగంటి సునీత సొంతం చేసుకుంటారని నమ్మకంతో ఆమెను జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో నిలబెట్టేందుకు దాదాపుగా సిద్ధమయినట్లు తెలిసింది. పార్టీలో నమ్మకంగా ఉండటంతో పాటు మాగంటి కుటుంబానికి టిక్కెట్ ఇచ్చి న్యాయం చేసినట్లు చెప్పుకోవడానికి కూడా కారు పార్టీ నేతలకు ఇది ఉప కరిస్తుంది.
సానుభూతి పవనాలు...
మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, రావుల శ్రీధర్ రెడ్డి వంటి సీనియర్ నేతలు టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ, గోపీనాథ్ కుటుంబ సభ్యునికే పార్టీ అవకాశం ఇవ్వాలని దాదాపుగా నిర్ణయించింది. మాగంటి గోపీనాధ్ మూడుసార్లు జూబ్లీహిల్స్ నుంచి విజయం సాధించారు. నియోజకవర్గంలోని ప్రజలతో ఆయనకు సత్సంబంధాలున్నాయి. మాగంటి గోపీనాథ్ పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ఆయన మరణంతో కలిగిన సానుభూతి కూడా కలసి వస్తుందని బీఆర్‌ఎస్ భావిస్తుంది. ఇలాంటి వ్యూహం పార్టీకి కొత్తది కాదు. 2024 జూన్‌లో సికింద్రాబాద్ కాంటోన్మెంట్ బోర్డు ఉప ఎన్నికల్లో, మాజీ ఎమ్మెల్యే జి. సాయన్న కుమార్తె లాస్య నందిత మృతి చెందిన తరువాత, మరో కుమార్తె నివేదితను బీఆర్‌ఎస్ అభ్యర్థిగా నిలబెట్టింది. ఆ పోటీలో పార్టీ కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయినప్పటికీ, దివంగత నేతల కుటుంబ సభ్యులకు టిక్కెట్ ఇచ్చే విధానాన్ని బీఆర్ఎస్ కొనసాగిస్తుంది. ఈ వ్యూహంతో కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టడానికి వీలవుతుందని కారు పార్టీ నేతలు గట్టిగా నమ్ముతున్నారు.