Shiva Balakrishna : ఎవుడ్రావీడు.. మరీ ఇంత టాలెంటె‌డ్‌గా ఉన్నాడు... రెరా స్టార్ అంటూ నెట్టింట కామెంట్స్

హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఆస్తులను చూసి ఏసీబీ అధికారులే షాక్ గురయ్యారు

Update: 2024-02-08 12:05 GMT

హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఆస్తులను చూసి ఏసీబీ అధికారులే షాక్ గురయ్యారు. ఒక అధికారి ఇన్ని ఆస్తులు సంపాదించడం సాధ్యమా? అన్న అనుమానాన్ని మనోడు పటాపంచాలు చేసి అవతల పారేశాడు. హెచ్‌ఎండీఏ డైరెక్టర్ గా, రెరా డైరెక్టర్ గా క్యాష్ కొట్టు అనుమతి పట్టు అన్న తరహాలో పర్మిషన్లు ఇచ్చిపడేశాడు. దీంతో డబ్బులే డబ్బులు. ఆస్తులే ఆస్తులు. ఒకటా రెండా వందల ఎకరాల భూములు. పదుల సంఖ్యలో ప్లాట్లు, ఫ్లాట్లు, విల్లాలు, బంగారం, వెండి, ఖరీదైన వాచీలు.. కార్లు.. ఇలా ఒక్కటేమిటి.... సినిమా హీరోలు నలభై ఏళ్లు శ్రమించి సంపాదించిన ఆస్తుల కంటే ఈ రెరా స్టార్ కేవలం ఐదారేళ్లలోనే కూడబెట్టాడంటే మామూలోడు కాదు.

విచారణలో ఆసక్తికరమైన...
ఏసీబీ అధికారులు శివబాలకృష్ణను విచారించి ఆయన వద్ద నుంచి ముఖ్యమైన సమాచారాన్ని రాబట్టినట్లు తెలిసింది. బినామీ పేర్లతోనే ఎక్కువ ఆస్తులు కొనుగోలు చేశాడని కనుగొన్నారు. తమ్ముడు నవీన్ కుమార్, మరదలు, మేనల్లుడు భరత్ ల పేరుతో పెద్ద మొత్తంలో భూములు, ప్లాట్లు, ఫ్లాట్లు కొనుగోలు చేసినట్లు ఏసీబీ విచారణలో వెల్లడియింది. శివ బాలకృష్ణ బినామీలలో పలువరు ఐఏఎస్ అధికారులు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. వారు శివబాలకృష్ణకు విధుల పరంగా సాయం అందించడంతోనే వారి పేరిట కొనుగోలు చేసినట్లు కూడా అటున్నారు. అయితే దీనిపై ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది.
ఆస్తులన్నీ బినామీల పేర్లపై...
ఏసీబీ డైరెక్టర్ జనరల్ వెల్లడించిన ఆస్తుల వివరాల ప్రకారం 234 ఎకరాల భూమి కొనుగోలు చేసినట్లు గుర్తించారు. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ తో పాటు విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లోనూ మనోడు బాగానే భూములు కొనుగోలు చేసినట్లు తేలింది. 70 శాతం ఆస్తులు బినామీ పేర్లపైనే పెట్టారని చెబుతున్నారు. తమ్ముడు నవీన్ కుమార్ ను ఇప్పటికే అరెస్ట్ చేశారు. యాదాద్రిలో 66 ఎకరాల భూమి ఉందని కనుగొన్నారు. సిద్దిపేటలో పది ఎకరాలు, నాగర్ కర్నూలు జిల్లాలో ముప్ఫయి, కడగండ్లలో 48 ఎకరాల భూమిని శివ బాలకృష్ణ తన సొంతం చేసుకున్నట్లు ఏసీబీ విచారణలో తేలింది.
ఈడీ, ఐటీ ఎంట్రీ...
అయితే శివబాలకృష్ణ ఆస్తుల వివరాలను తెలిసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తో పాటు ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు కూడా దృష్టి పెట్టారు. ఏసీబీ విచారణలో వెల్లడయిన వివరాలను తమకు అందించాలని ఈడీ, ఐటీ అధికారులు కోరినట్లు తెలిసింది. ఎఫ్ఐఆర్ తో పాటు ఆస్తుల వివరాలను కూడా తమకు పంపాలని ఈడీ, ఐటీ అధికారులు ఏసీబీని కోరడంతో ఇక మనోడికి దబిడి దిబిడే అన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఇంత తక్కువ సమయంలో అన్ని ఆస్తులు కూడబెట్టడటంపై అధికారులే నోరెళ్లపడుతున్నారు.
Tags:    

Similar News