Sigachi Industry Accident : కార్మికుల జాడ తెలియలేదు... 42 మందికి చేరిన మృతుల సంఖ్య
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో జరిగిన పేలుడులో ఇప్పటి వరకూ 42 మంది మరణించారు
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో జరిగిన పేలుడులో ఇప్పటి వరకూ 42 మంది మరణించారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరణిస్తున్నారు. వారం రోజుల క్రితం సంఘటన జరిగినప్పటికీ కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ ఎక్కువ మంది మరణించారు. అక్కడికక్కడే ఐదుగురు కార్మికులు సజీవం దహంకాగా, మరికొందరి శరీరాలు ఆనవాళ్లు కూడా లభించడం లేదు. దాదాపు తొమ్మిది మంది కార్మికుల జాడ ఇప్పటి వరకూ తెలియదు. వారి శరీర భాగాలు కూడా కనిపించలేదు. కార్మికుల కుటుంబాలు మాత్రం తమ వారి ఆచూకీ దొరుకుతుందేమోనని అక్కడే వేచి చూస్తున్నారు.
సహాయ కార్యక్రమాలు...
సహాయకార్యక్రమాలు దాదాపుగా నిలిచిపోయాయి. అయితే మరొకసారి శిధిలాల్లో కార్మికుల శరీరభాగాలు ఏమైనా దొరుకుతాయోమోనని సహాయక బృందాలు ప్రయత్నించినా ఫలించలేదు. అయితే తప్పిపోయిన తొమ్మిది మంది కార్మికులు పూర్తిగా కాలిపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. అందుకే కనీసం వారి శరీర భాగాలు కూడా కనిపించకుండా పోయాయని అంటున్నారు. బంధువులు మాత్రం తమ వారి మృతదేహాలను అయినా అప్పగించాలని వేడుకుంటున్నారు. అంత్యక్రియలను నిర్వహించుకుంటామని పరిశ్రమ వద్దనే రోదిస్తున్నారు. మార్చురీలో కూడా గుర్తుపట్టలేని ఇద్దరి మృతదేహాలను అధికారులు గుర్తించగలిగారు. ఒకరు ఇస్నాపూర్ కు చెందిన దాసరి రామాంజనేయులు కాగా, మరొకరు మధ్యప్రదేశ్ కు చెందిన చికెన్ సింగ్ ది గా గుర్తించి వారి బంధువులకు అప్పగించారు.
మూడు నెలల పాటు...
ఇంకా పద్దెనిమిది మంది కార్మికులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే కనిపించని తొమ్మిది మంది కార్మికుల జాడ కోసం ఇంకా వెదుకుతామని, ఓపికపట్టాలని అధికారులు, అక్కడ సహాయక బృందాలు చెబుతున్నాయి. సిగాచీ పరిశ్రమను మూడు నెలల పాటు మూసివేస్తున్నట్లు పరిశ్రమ యాజమాన్యం ప్రకటించడంతో వారు ఏమి చేయాలో దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో ప్రమాదానికి యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి కారణమని కార్మికులు ఆరోపిస్తున్నారు. మృతుల కుటుంబాలకు ఇప్పటికే సిగాచీ పరిశ్రమ యాజామాన్యం కోటి రూపాయల పరిహారం ప్రకటించింది. కనిపించని తమ వారి కోసం వెదుకుతున్నారు.