Cyber Crime : ఐదు వేలు ఆశచూపి...2.9 కోట్లకు టోకరా
హైదరాబాద్ లో మరో భారీ సైబర్ మోసం వెలుగు చూసింది
హైదరాబాద్ లో మరో భారీ సైబర్ మోసం వెలుగు చూసింది. కేవలం ఐదు వేల రూపాయలు ఆశ చూపి ఐటీ ఉద్యోగి నుంచి రూ.2.9 కోట్లు స్వాహా చేసిన ఘటన హైదరాబాద్ లో జరిగింది. హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లికి చెందిన ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. గతేడాది నవంబరు 12న వాట్సాప్‌లో వచ్చిన లింకు ద్వారా స్టాక్ మార్కెట్ పెట్టుబడుల సలహాలు ఇచ్చే గ్రూపులో చేరిన బాధితుడు, అనిల్ గోయల్ అనే వ్యక్తి చెప్పినట్లుగా యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నాడు.
వాట్సాప్ లో వచ్చిన లింకు
300 శాతం లాభాల ఆశతో మొదట 50 వేల రూపాయలు పెట్టుబడి పెట్టి, ఆ తర్వాత మొత్తం రూ.2.9 కోట్లు బదిలీ చేశాడు. యాప్‌లో రూ.3.47 కోట్లు కనిపించినా, డబ్బును విత్‌డ్రా చేసుకోలేక మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.