వడదెబ్బ లక్షణాలేంటి ? వడదెబ్బ తగిలితే ఏం చేయాలి ? తీసుకోవాల్సిన జాగ్రత్తలు !

వేసవిలో చాలా మంది వడదెబ్బ బారిన పడుతుంటారు. కానీ చాలా మందికి వడదెబ్బ అంటే ఏంటో తెలియదు. ఏదో నీరసంగా ..

Update: 2022-04-01 06:13 GMT

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. భానుడు చండ ప్రచండ రూపాన్ని దాల్చి.. ప్రజలకు మంట పుట్టిస్తున్నాడు. రాత్రి - పగలు తేడా లేకుండా ఉక్కపోత పెరిగిపోతోంది. ముఖ్యంగా రెండ్రోజుల వరకూ ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దంటూ హెచ్చరికలు జారీ అయ్యాయి. అధిక ఉష్ణోగ్రతలకు తోడు.. వడగాలులు వీస్తున్నాయి. దాంతో రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేశాయి.

వడదెబ్బ లక్షణాలు
వేసవిలో చాలా మంది వడదెబ్బ బారిన పడుతుంటారు. కానీ చాలా మందికి వడదెబ్బ అంటే ఏంటో తెలియదు. ఏదో నీరసంగా ఉందిలే కాస్త రెస్ట్ తీసుకుంటే సరిపోతుందనుకుంటారు. అదే పొరపాటు. అసలు వడదెబ్బ లక్షణాలేంటి ? వడదెబ్బ తగిలిన వారు ఎలా ఉంటారు ? తెలుసుకుందాం.
వడదెబ్బకు గురైన వారికి 102 డిగ్రీల ఫారెన్ హీట్ కంటే తక్కువ జ్వరం, వాపు, మూర్చ వచ్చే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా అలసట, వికారం, తలనొప్పి, వాంతులు, కండరాల్లో తిమ్మిరి, అధికంగా చెమటలు పట్టడం వంటి లక్షణాలు ఉంటాయి. వడదెబ్బ తగిలిన వారిని వెంటనే చల్లనిగాలి తగిలే ప్రదేశానికి చేర్చాలి. అలాగే ఉప్పు కలిపిన మజ్జిగ లేదా గ్లూకోజు నీళ్లు, ఓఆర్ఎస్ తాగించాలి. వడదెబ్బ తగిలి అపస్మారక స్థితిలోకి వెళ్లిన వ్యక్తికి బీపీ హెచ్చుతగ్గుల వల్ల కార్డియాక్‌ అరెస్ట్‌ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెంటనే ఆస్పత్రికి తరలించాలి.
వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వడదెబ్బ తగలకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. కరోనా సమయంలో వైరస్ ను నియంత్రించేందుకు ఎన్ని జాగ్రత్తలైతే పాటించామో.. ఇక్కడ కూడా అన్ని జాగ్రత్తలూ పాటించాలి. ఫ్రిడ్జ్ లో పెట్టిన పానీయాలు కాకుండా (కూల్ డ్రింక్స్) నేచురల్ గా చల్లగా ఉండే మజ్జిగ, కొబ్బరినీరు, నిమ్మకాయ నీళ్లు, పుదీనా వాటర్, సబ్జా వాటర్ వంటివి తరచూ తాగాలి. అలాగే కుండలో పోసిన నీరు తాగడం ఆరోగ్యానికి శ్రేయస్కరం.
ఎండలో బయటికి వెళ్లేటపుడు లేత రంగులు, వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. ఎండ నుంచి రక్షణ పొందేందుకు కూలింగ్ గ్లాసెస్, గొడుగు/టోపీ పెట్టుకోవాలి. ముఖ్యంగా అత్యవసరం కాకుంటే.. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య ఆరుబయట పని చేయకుండా వుండాలి.




Tags:    

Similar News