ఫ్యాక్ట్ చెక్: ఎండలో ఉంచిన కారణంగా సిలిండర్ పేలిందంటూ వైరల్ అవుతున్న వీడియోను ఏఐ ద్వారా సృష్టించారు

ఎండలో ఉంచిన కారణంగా సిలిండర్ పేలిందంటూ వైరల్ అవుతున్న వీడియో

Update: 2026-03-22 08:32 GMT

మధ్యప్రాచ్య దేశాల్లో యుద్ధ వాతావరణం ప్రభావం ప్రపంచ దేశాలతో పాటు భారత్‌పై కూడా పడుతోంది. ముఖ్యంగా చమురు, గ్యాస్ సరఫరా భారత్‌కు సవాలుగా మారింది. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సైనిక దాడుల తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. దీనికి ప్రతికారంగా ఇరాన్ అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన హోర్ముజ్ జలసంధిని మూసివేసింది. దీనివల్ల సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ వంటి దేశాల నుండి భారత్‌కు అందే గ్యాస్ సరఫరా నిలిచిపోయింది.


అయితే భారతదేశంలో ఎల్‌పీజీ సిలిండర్ల కోసం సామాన్యులు పడుతున్న ఆందోళనలు కాస్త తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజులుగా గృహ వినియోగదారులు భయంతో చేస్తున్న బుకింగ్‌లు గణనీయంగా తగ్గాయని పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ వెల్లడించారు. సిలిండర్ బుకింగ్ చేసుకున్న వారికి త్వరగానే సిలిండర్ లభిస్తూ ఉంది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ దేశీయంగా గ్యాస్ ఉత్పత్తిని ఏకంగా 40 శాతం పెంచడం వల్ల సరఫరాలో ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సిలిండర్ బుక్ చేసుకున్న వారికి డెలివరీ కూడా త్వరగానే జరుగుతుంది.

ఇంతలో ఓ సిలిండర్ పేలిపోయిన వీడియో వైరల్ అవుతూ ఉంది. బైక్ మీద సిలిండర్ పెట్టడం వలన ఎండ వేడికి సిలిండర్ పేలిందంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వైరల్ పోస్టులకు సంబంధించిన ఆర్కైవ్ లింక్స్ ఇక్కడ, ఇక్కడ ఉన్నాయి.

వైరల్ వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు



 



ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వీడియోలో ఎలాంటి నిజం లేదు. ఏఐ ద్వారా వీడియోను సృష్టించారు.

మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ నిర్వహించాం. అయితే ఇలాంటి ఘటన చోటు చేసుకుందనే వాదనతో ఎలాంటి మీడియా కథనాలు కూడా మాకు లభించలేదు.

వైరల్ వీడియోలోని స్క్రీన్ షాట్ తీసుకుని గూగుల్ లెన్స్ ద్వారా రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. మార్చి 17, 2026న “ది ఘుమక్కడ్” అనే ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేసిన ఒక వీడియో మాకు లభించింది. వైరల్ క్లిప్‌లో కనిపించిన ఎల్‌పిజి సిలిండర్ పేలుడుకు సంబంధించిన అదే ఫుటేజ్ ఈ వీడియోలో ఉంది. వైరల్ వీడియోకు సంబంధించిన అసలు మూలం ఇదేనని మేము గుర్తించాం.

అది నిజమైన సంఘటనను చూపిస్తుందో లేదో నిర్ధారించడానికి ప్రయత్నించగా, కేవలం వినోదం, అవగాహన ప్రయోజనాల కోసం విఎఫ్ఎక్స్, ఎడిటింగ్ ఉపయోగించి ఆ దృశ్యాలను సృష్టించారు. వీడియో అప్లోడ్ చేసిన అకౌంట్ లో కూడా అదే విషయాన్ని ప్రస్తావించారు.

Full View


ఆ ఫేస్‌బుక్ పేజీ షేర్ చేసిన ఇతర పోస్ట్‌లను కూడా మేము పరిశీలించాం. అవగాహన, వినోద ప్రయోజనాల కోసం రూపొందించిన స్క్రిప్టెడ్ వీడియోలను ఈ అకౌంట్ లో షేర్ చేస్తున్నారని కనుగొన్నాం. ఆ పేజీలోని “About” విభాగంలో “ఈ పేజీలోని అన్ని వీడియోలు స్క్రిప్టెడ్ లేదా కేవలం అవగాహన మరియు వినోద ప్రయోజనాల కోసం మాత్రమే రూపొందించాం. దయచేసి వాటిని సీరియస్‌గా తీసుకోవద్దు.” అని అందులో ఉంది.

 



 


అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు



 



కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.

గ్యాస్ సిలిండర్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

ఇంట్లో నుంచి గ్యాస్ వాసన వస్తున్నట్లు అనిపించినా, లేక గ్యాస్ లీకైనట్లు మీరు గుర్తించినా వెంటనే రెగ్యులేటర్‌ను ఆపేయాలి. రెగ్యులేటర్‌ను సిలిండర్ నుంచి తొలగించి, దాని వాల్వ్‌పై మూతను గట్టిగా బిగించాలి. వంట గది పరిసరాల్లో అన్ని రకాల మంటలను ఆపేయాలి. ఇంట్లోని విద్యుత్ పరికరాల స్విచ్‌లను ఆన్/ఆఫ్ చేయకూడదు. ఇంట్లోని తలుపులు, కిటికీలు తెరిచి ఉంచాలి. గ్యాస్ లీకవుతున్న ప్రాంతంలో మొబైల్ ఫోన్ వాడకూడదు. వెంటనే అత్యవసర సేవల నంబర్ 1906కు ఫోన్ చేసి సమాచారాన్ని అందించాలి. సిలిండర్‌ను ఎల్లప్పుడూ నిటారుగా ఉంచాలి. ఎండ లేదా వేడి వచ్చే ప్రదేశాల్లో సిలిండర్లు ఎక్కువ సేపు ఉంచకూడదు. సిలిండర్‌లో ఏదైనా సమస్య ఉంటే వెంటనే గ్యాస్ ఏజెన్సీ లేదా అగ్నిమాపక దళానికి కాల్ చేయండి. కొత్తగా తయారయ్యే ప్రతీ సిలిండర్‌ను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) పరీక్షిస్తుంది. నిబంధనల ప్రకారం, ప్రతీ సిలిండర్‌ను నిర్ణీత కాలవ్యవధి తర్వాత తప్పకుండా పరీక్షించాల్సి ఉంటుంది. పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (పీఈఎస్‌ఓ) నిబంధనల ప్రకారం కూడా సిలిండర్లను పరీక్షిస్తారు.


Claim :  ఎండలో ఉంచిన కారణంగా సిలిండర్ పేలిందంటూ వైరల్ అవుతున్న వీడియో
Claimed By :  Social Media Users
Fact Check :  Unknown
Tags:    

Similar News