ఫ్యాక్ట్ చెక్: నడి వీధిలో నడుచుకుంటూ వెళుతూ తమ ప్రాణాలను కాపాడాలంటూ బంగ్లాదేశ్ హిందూ యువకుడు వేడుకుంటున్న వీడియో ఏఐ సృష్టి

నడి వీధిలో నడుచుకుంటూ వెళుతూ తమ ప్రాణాలను కాపాడాలంటూ బంగ్లాదేశ్ హిందూ యువకుడు

Update: 2025-12-27 05:32 GMT

బంగ్లాదేశ్‌లో ఇటీవల ఇద్దరు హిందూ వ్యక్తులను కొట్టి చంపిన సంఘటనలను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. పొరుగు దేశంలో మైనారిటీలపై జరుగుతున్న దాడులపై విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. MEA ప్రతినిధి రణధీర్ జైస్వాల్ "బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై నిరంతర దాడులు ఆందోళనకరమైన విషయం. బంగ్లాదేశ్‌లో ఇటీవల ఒక హిందూ యువకుడి హత్యను మేము ఖండిస్తున్నాము. నేరానికి పాల్పడిన వారికి చట్టపరమైన శిక్ష పడాలని ఆశిస్తున్నాము" అని జైస్వాల్ అన్నారు. మైనారిటీలపై దాడులపై భారతదేశం నిరంతరం ఆందోళన వ్యక్తం చేస్తోందని, బంగ్లాదేశ్ అటువంటి సంఘటనలని తిరస్కరించిందని MEA తెలిపింది. MEA ప్రకారం, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ హయాంలో మైనారిటీలపై దాదాపు 2,900 హింస సంఘటనలు జరిగాయి.

ఇద్దరు హిందూ బంగ్లాదేశీయులను కొట్టి చంపడం భారతదేశంలో నిరసనలకు కారణమైంది. పలు రాష్ట్రాలలో బంగ్లాదేశ్ ప్రభుత్వం నుండి జవాబుదారీతనం కోరుతూ నిరసనలు చెలరేగాయి. మైనారిటీలపై, ముఖ్యంగా హిందువులపై జరుగుతున్న దారుణాలను ఆపాలని డిమాండ్ చేస్తూ పలు హిందూ సంస్థలు భారతదేశ వ్యాప్తంగా నిరసనకు దిగాయి. పొరుగు దేశంలో మైనారిటీలపై జరుగుతున్న దారుణాలను నిరసిస్తూ కోల్‌కతాలోని బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషన్ వెలుపల వేలాది మంది గుమిగూడారు. ఈ ర్యాలీలో పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నాయకుడు (LoP) భారతీయ జనతా పార్టీ (BJP) నాయకుడు సువేందు అధికారి కూడా ఉన్నారు. హిందువులపై జరుగుతున్న దారుణాలకు సంబంధించి అధికారులతో మాట్లాడటానికి బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషన్ ప్రాంగణంలోకి ప్రవేశించారు.

దీపు చంద్ర దాస్ ను చంపేసిన తర్వాత, అమృత్ మండల్ అనే మరో హిందూ వ్యక్తిని బంగ్లాదేశ్‌లో ఒక గుంపు కొట్టి చంపినట్లు సమాచారం. ఇంతలో మరో సెల్ఫీ వీడియో ఒకటి వైరల్ అవుతూ ఉంది. ఆ వీడియోలో బంగ్లాదేశ్‌లోని ఒక హిందూ వ్యక్తి తన ప్రాణాలకు, ఇతర హిందువుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని వేడుకుంటున్నట్లు కనిపిస్తోంది.

ఆ సెల్ఫీ వీడియోలో ఒక వ్యక్తి అనేక దుకాణాలకు నిప్పు పెట్టిన వీధి గుండా వెళుతున్నట్లు చూపిస్తుంది. "నేను బంగ్లాదేశ్‌లో ఉన్నాను. ఇది రాత్రి సమయం. దీపు చాదర్ లాగా, వారు మమ్మల్ని కూడా చంపేస్తారు. ఇక్కడ ఏమి జరుగుతుందో మీరు చూడవచ్చు. ఎవరైనా మమ్మల్ని రక్షించగలిగేలా ఈ వీడియోను వీలైనంత ఎక్కువగా షేర్ చేయండి. నాకు ఏమీ అర్థం కాలేదు. పరిస్థితులు క్షీణించాయి." అని అందులో చెప్పడం మనం వినవచ్చు.

"ఇప్పుడు రాత్రి అయింది
నా చుట్టూ ఉన్న హిందూ ఇళ్లకు నిప్పు పెడుతున్నారు
ముస్లింలు మా సోదరుడు దీపు చంద్రను సజీవ దహనం చేశారు మరియు ఇప్పుడు మమ్మల్ని కూడా దహనం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి…" అంటూ పలువురు ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

ఆ వీడియోలకు సంబంధించిన లింక్స్ ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

వైరల్ పోస్టులకు సంబంధించిన ఆర్కైవ్ లింక్స్  ఇక్కడ, ఇక్కడ ఉన్నాయి. 

వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఇక్కడ చూడొచ్చు



 



ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ వీడియో ఏఐ సృష్టి.

వైరల్ అవుతున్న వీడియోలో ఎన్నో తేడాలు మాకు కనిపించాయి. నడుచుకుని వెళుతూ ఉండగా మంటలు ఎగసిపడడం, కరెంట్ స్థంభం, కారు రంగులు మారడం వంటి తేడాలు కనిపించాయి. వీధిలో కనీసం ఒకరు కూడా కనిపించకపోవడం, ఇవన్నీ సాధారణంగా ఏఐ వీడియోలలో కనిపించే తప్పులు.

ఇక వైరల్ వీడియోకు సంబంధించి ఏవైనా మీడియా కథనాలు లభిస్తాయేమోనని సంబంధిత కీవర్డ్స్ తో సెర్చ్ చేశాం. అటు బంగ్లాదేశ్ మీడియా సంస్థలు కానీ, ఇటు భారతదేశానికి సంబంధించిన మీడియా సంస్థలు కానీ ఈ సంఘటనలను నివేదించలేదు.

వైరల్ వీడియోకు సంబంధించిన కీఫ్రేమ్స్ ను తీసుకుని మేము గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం.

డిసెంబర్ 24న ఇన్‌స్టాగ్రామ్‌లో కుల్దీప్ మీనా అనే వ్యక్తి దీన్ని మొదట పోస్ట్ చేసినట్లు మేము కనుగొన్నాము. ఈ అకౌంట్ లో ఒకే వ్యక్తిని కలిగి ఉన్న అనేక AI- జనరేటెడ్ సెల్ఫీ వీడియోలు ఉన్నాయని మేము గమనించాము.



బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులకు సంబంధించి పలు వీడియోలను అతడు ఏఐ ద్వారా సృష్టించి పోస్ట్ చేశాడని గుర్తించాం. అందుకు సంబంధించిన లింక్స్
ఇక్కడ
, ఇక్కడ చూడొచ్చు. 



 

ఇక ఏఐ డిటెక్షన్ టూల్ హైవ్ మోడరేషన్ ను ఉపయోగించి సెర్చ్ చేయగా ఈ వీడియో ఏఐ సృష్టి అని తేల్చింది. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు.


 

కాబట్టి, వైరల్ అవుతున్న వీడియో ఏఐ సృష్టి అని ధృవీకరించాం.


Claim :  వైరల్ వీడియోను ఏఐ ద్వారా సృష్టించారు
Claimed By :  Social Media Users
Fact Check :  Unknown
Tags:    

Similar News