ఫ్యాక్ట్ చెక్: ఆర్ఎస్ఎస్-బీజేపీకి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టిన యువకులపై యూపీ పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారంటూ జరుగుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.

ఆర్ఎస్ఎస్-బీజేపీకి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టిన యువకులపై యూపీ పోలీసులు లాఠీ ఛార్జ్

Update: 2026-01-17 04:12 GMT

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) అఖిల భారత కేంద్ర కార్యనిర్వాహక కమిటీ సమావేశం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బృందావన్‌లోని కేశవ్ ధామ్‌లో నిర్వహించారు. RSS చీఫ్ మోహన్ భగవత్ అధ్యక్షతన జరిగిన క్లోజ్డ్ డోర్ సమావేశంలో బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై ఇటీవల జరిగిన దాడులు, ఇతర అంశాలు చర్చించారు. RSS ఈ ఏడాది శతాబ్ది ఉత్సవాలను జరుపుకుంటున్నందున దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రజలతో మమేకమయ్యే వ్యూహాలపై కేంద్ర ఆఫీస్-బేరర్ల సమావేశంలో చర్చించారు. సంఘ్ సూత్రాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం, గ్రామ స్థాయి సమావేశాల ద్వారా ప్రజలలో సామరస్య భావాన్ని పెంపొందించడం గురించి కూడా చర్చలు జరిగాయి. ఇక 2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, పశ్చిమ బెంగాల్ పరిస్థితి, వివిధ రాష్ట్రాల్లో వలసలు, దానిని పరిష్కరించడానికి ఒక చట్రాన్ని అభివృద్ధి చేయడం వంటి అంశాలను కూడా ఈ చర్చల్లో కవర్ చేశారు. సంస్థాగత విషయాలపై కూడా సమగ్ర చర్చ నిర్వహించారు.


ఉత్తరప్రదేశ్ పోలీసుల యాక్షన్ అని చెప్పుకునే ఒక వీడియో వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ అవుతోంది. అందులో, పోలీసులు కొంతమంది యువకులను కొడుతున్నట్లు చూడవచ్చు. వీరంతా భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ లకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారని, వీరిపై ఉత్తరప్రదేశ్ పోలీసులు చర్యలు తీసుకున్నారంటూ పోస్టులు పెట్టారు. పోలీసులు కొంతమంది యువకులను కొట్టి, ఈడ్చుకుంటూ వెళ్తున్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను షేర్ చేస్తున్న వారు ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగిందని చెబుతున్నారు.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేసిన నిరసనకారులపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉందని షేర్ చేశారు. ముస్లిం సమాజానికి చెందిన వ్యక్తులు నిరసనల్లో అవమానకరమైన భాషను ఉపయోగించారని, మధ్యాహ్నం 12 గంటలకు ఒక ర్యాలీ నిర్వహించారని ‘RSS-BJPని నరికివేయండి’ నినాదాలు చేశారని పోస్టుల్లో తెలిపారు. ఆ తర్వాత యోగి ప్రభుత్వం రాత్రి 7 గంటలకు వారిని పట్టుకుందని పోస్టుల్లో తెలిపారు.

వైరల్ అవుతున్న పోస్టులను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.

వైరల్ పోస్టులకు సంబంధించిన ఆర్కైవ్ లింక్స్ ఇక్కడ, ఇక్కడ ఉన్నాయి.


వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఇక్కడ ఉంది.



 



ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ కు ఎలాంటి సంబంధం లేదు.

ఇటీవలి కాలంలో ఉత్తరప్రదేశ్ లో ఇలాంటి నిరసనలు చోటు చేసుకున్నాయా? అని తెలుసుకోడానికి మేము సంబంధిత కీవర్డ్స్ తో సెర్చ్ నిర్వహించాం. అయితే మాకు అందుకు సంబంధించిన ఎలాంటి కథనాలు లభించలేదు.

వైరల్ వీడియోలోని 'ఆగు.. ఆగు..', 'బండెక్కించు' లాంటి పదాలు వినిపించాయి.

ఇక వైరల్ అవుతున్న వీడియో లోని స్క్రీన్ షాట్ ను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ నిర్వహించాం. ఆగస్టు 24, 2022న హైదరాబాద్‌ జర్నలిస్ట్ యూనస్ లాసానియా షేర్ చేసిన X పోస్ట్‌లో వైరల్ వీడియోను కనుగొన్నాము.



వైరల్ వీడియోలోనూ, ఈ వీడియోలోనూ ఉన్నది ఒకే విజువల్స్ అని స్పష్టంగా తేలింది.

"ప్రవక్త ముహమ్మద్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సస్పెండ్ చేయబడిన బీజేపీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నిరసనలు ఉధృతంగా మారడంతో నగర పోలీసులు అనేక ఇళ్లలోకి ప్రవేశించి శాలిబండ, చుట్టుపక్కల ముస్లిం యువకులను బయటకు లాక్కెళ్లారు. రాజా సింగ్ కు వ్యతిరేకంగా నిరసన తెలిపిన 50 మందికి పైగా వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు." అని మీడియా కథనాలు తెలిపాయి.

ఆగస్టు 23, 2022న అరెస్టు అయిన తర్వాత రాజా సింగ్ అదే రోజు బెయిల్ పొందారు. ఇది నిరసనకారులను ఆగ్రహానికి గురిచేసింది. ప్రవక్త ముహమ్మద్ పై అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన రాజా సింగ్ ను అరెస్టు చేయాలని షాలిబండలోని యువకులు డిమాండ్ చేశారు. నిరసనల్లో పాల్గొనకపోయినా పోలీసులు తమ ఇంట్లోకి చొరబడి తమను తీసుకెళ్లారని అరెస్టు చేసిన కొంతమంది ముస్లిం యువకులు తెలిపారు. ఈ విషయం తెలిసిన వెంటనే స్థానిక AIMIM కార్పొరేట్ ముజఫర్ అక్కడికి చేరుకున్నారు. ఈ ఘటనలు 2022 సంవత్సరం ఆగస్టు నెలలో చోటు చేసుకున్నాయి.

అందుకు సంబంధించిన కథనాలను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.

https://www.siasat.com/prophet-row-hyderabad-cops-arrest-youth-from-homes-after-protests-intensify-2397574/

ఇక వైరల్ వీడియోలోని లొకేషన్ హైదరాబాద్ లోనిదే అని జియో లొకేషన్ ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. ఆ లింక్ ను ఇక్కడ చూడొచ్చు.



 


వైరల్ వీడియోలో ‘SHAFFAF’ అనే బోర్డును మేము పరిశీలించాం. ఇది హైదరాబాద్‌లో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ సరఫరా చేసే దుకాణం అని మేము కనుగొన్నాము. హైదరాబాద్‌లోని శాలిబండలోని బంజా గల్లీ 2లో ఉంది.


కాబట్టి, వైరల్ అవుతున్న వీడియో హైదరాబాద్ నగరానికి చెందినది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఘటన కాదు.


Claim :  వైరల్ వీడియోలోని ఘటన 2022లో హైదరాబాద్ లో చోటు చేసుకుంది
Claimed By :  Social Media Users
Fact Check :  Unknown
Tags:    

Similar News