Tirumala : నేడు తిరుమలకు వెళ్లే వారికి అలెర్ట్.. రద్దీ ఎలా ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. కొత్త సంవత్సరం కావడంతో పాటు వైకుంఠ ద్వార దర్శనాలకు వచ్చిన భక్తులతో తిరుమల కిటకిటలాడుతుంది. గోవింద నామస్మరణలతో తిరుమల వీధులన్నీ మారుమోగిపోతున్నాయి. తిరుమలకు వచ్చే భక్తులను అలిపిరి టోల్ గేట్ వద్ద తనిఖీల కోసం చాలా సేపు వేచి చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. వైకుంఠ ద్వార దర్శనాల కోసం ముందుగా బుక్ చేసుకున్న వారు తిరుమలకు చేరుకుని తమకు కేటాయించిన సమయంలో స్వామి వారిని దర్శించుకుంటున్నారు.
కొత్త ఏడాది తొలి రోజు...
తిరుమలలో కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీవారి ఆలయం ముందు వేలాది మంది భక్తులు సందడి చేశారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. లడ్డూ ప్రసాదాలు, మిఠాయిలు పంచుకున్నారు. కాగా తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. రేపటి నుంచి టోకెన్లు లేని భక్తులను కూడా దర్శనానికి అనుమతించనున్నారు. దీంతో ఈరోజు స్లాట్ లు కేటాయించిన భక్తులకు అవసరమైన వసతి గదులు వెంటనే దొరకడం కూడా కష్టంగా మారింది.
వైకుంఠ ద్వార దర్శనాలకు...
ఈరోజు తిరుమలలోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని రకాల చర్యలను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చేపట్టారు. శ్రీవారి సేవకుల ద్వారా వారికి అన్నప్రసాదాలను, మజ్జిగ, పాలు, మంచినీటిని పంపిణీ చేస్తున్నారు. తిరుమలలోని శ్రీవారిని దర్శించుకునేందుకు తోపులాల లేకుండా స్వామి వారిని దర్శించుకున్నారు. నిన్న ఒక్కరోజు తిరుమలకు దాదాపు 7౦,256 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని, హుండీ ఆదాయం మూడు కోట్లకుపైగానే వచ్చిందని అధికారులు తెలిపారు.