Tirumala : ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది
తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుండటంతో అందుకు అవసరమైన ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చేస్తున్నారు. మూడు నెలలు ముందుగానే ప్రత్యేక దర్శనం టిక్కెట్లను ఆన్ లైన్ లో విక్రయిస్తున్నారంటే... తిరుమలకు ఏ రోజూ రద్దీ తక్కువగా ఉండదని అర్థమవుతుంది. ఏప్రిల్ నెల టిక్కెట్లు ఈ నెలలో విడుదల కానున్నాయి. తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అందుకు తగిన జాగ్రత్తలను టీటీడీ ముందు నుంచి తీసుకుంటుంది.
భక్తుల సంఖ్య పెరగడంతో...
ఇక రోజు వారీ ఎస్.ఎస్.డి టోకెన్లు జారీ చేస్తుండటంతో పాటు, కాలినడకన వచ్చే వారి సంఖ్య కూడా ఇటీవల కాలంలో ఎక్కువగా ఉంది. ఇక జనరేషన్ తో సంబంధం లేకుండా, ప్రాంతాలుతో పనిలేకుండా దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తిరుమలకు తరలి వస్తున్నారు. రోజుకు ఎనభై వేల మందికి పైగానే భక్తులు స్వామి వారిని యావరేజ్ న దర్శించుకుంటున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఇక విదేశాల నుంచి వచ్చే వారి సంఖ్య కూడా ఇటీవల పెరిగిందని చెబుతున్నారు.
పదమూడు కంపార్ట్ మెంట్లలో
ఈరోజుతిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పదమూడు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు మూడు గంటల నుంచి నాలుగు గంటలకు పైగానే పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 73,788 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 23,449 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.65 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.