Tirumala : నేడు తిరుమలకు వెళ్లేవారు ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే
తిరుమలలో భక్తుల నేడు రద్దీ కొనసాగుతుంది
తిరుమలలో భక్తుల నేడు రద్దీ కొనసాగుతుంది. అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో కొండ భక్తులతో కిటకిట లాడుతుంది. ఇప్పటికే తిరుమల కొండకు చేరుకున్న భక్తులతో పాటు అలిపిరి టోల్ గేట్ వద్ద కూడా వాహనాల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంది. వరసగా సంక్రాంతి సెలవులు రావడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. తిరుమలకు వచ్చే భక్తులకు అన్ని రకాలుగా సౌకర్యాలను ఏర్పాట్లు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
ఘాట్ రోడ్డులో కూడా వాహనాల రద్దీ...
ఘాట్ రోడ్డులో కూడా వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. వచ్చే సమయంలోనూ, కొండ దిగే సమయంలోనూ తగిన జాగ్రత్తలు పాటించాలని, తక్కువ వేగంతో ప్రయాణించి ప్రమాదాలను నివారించాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కోరుతున్నారు. వసతి గృహాలు దొరకడం కూడా కష్టంగా మారింది. ఆదివారం వరకూ ఇదే రకమైన రద్దీ కొనసాగే అవకాశముందని అధికారులు తెలిపారు. అయితే బయట క్యూ లైన్ లో శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు అవసరమైన అన్నప్రసాదాలను, మజ్జిగ, మంచినీరు, పాలను పంపిణీ చేస్తున్నారు.
హుండీ ఆదాయం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట శిలాతోరణం వరకూ భక్తుల క్యూ లైన్ విస్తరించింది. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించే భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఆరు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 64,064 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 30,663 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.80 కోట్ల రూపాయలు వచ్చిందని తెలిపారు.