Tirumala : తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. గంటలోనే దర్శనం
తిరుమలలో భక్తుల రద్దీ నేడు తక్కువగా ఉంది
తిరుమలలో భక్తుల రద్దీ నేడు తక్కువగా ఉంది. స్వామి వారి దర్శనం కొద్ది సమయంలోనే పూర్తవుతుంది. గంటల కొద్దీ వేచి ఉండాల్సిన పనిలేకుండా త్వరితగతిన భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. సంక్రాంతి పండగకు అందరూ సొంతూళ్లకు వెళ్లడంతో తిరుమల బోసిపోయినట్లు కనిపిస్తుంది. భక్తులు అతి తక్కువగా రావడంతో పెద్దగా వేచి ఉండాల్సిన అవసరం లేదు. స్వామి వారిని కనులారా చూసేందుకు వీలు కలుగుతుంది. ఇప్పుడు తిరుమలకు వచ్చే భక్తులకు కొద్దిసేపు స్వామి వారి ఎదుట ఉండే అవకాశాన్ని కల్పిస్తున్నారు.
ఘాట్ రోడ్డు ప్రయాణంపై నిబంధనలివే...
తిరుమలకు వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కొన్ని కీలక సూచనలు చేసింది. ఘాట్ రోడ్డు సమయాలు నిర్దేశించింది. కార్లు , బస్సులు తెల్లవారుజామున మూడు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు, అర్ధరాత్రి 12 గంటల నుంచి మూడు గంటల వరకు రోడ్డు మూసివేస్తారు. ద్విచక్ర వాహనాలు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు. జంతువుల వల్ల రాత్రి వేళల్లో బైక్‌లకు అనుమతి లేదు. ఘాట్ రోడ్డులో ప్రమాదాలను అరికట్టడానికి టీటీడీ ప్రయాణ సమయంపై పరిమితులు విధించింది. టోల్ గేట్ వద్ద వాహనం ఎంట్రీ టైమ్ రికార్డ్ చేస్తారు. * తిరుపతి నుండి తిరుమల కనీసం 28 నిమిషాలు పట్టాలి.* తిరుమల నుండి తిరుపతి కి కనీసం 40 నిమిషాలు పట్టాలి. నిర్ణీత సమయం కంటే ముందే చేరుకుంటే టోల్ గేట్ వద్ద జరిమానా విధించే అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణంలో వేగం తగ్గించాలని కోరింది.
నాలుగు కంపార్ట్ మెంట్లలోనే...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని నాలుగు కంపార్ట్ మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం కోసం ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం నాలుగు గంటల సమయం మాత్రమే పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు రెండు గంటల్లో దర్శనం పూర్తవుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం గంటలో పూర్తవుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 76,447 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 21,708 మంది తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.42 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.