Tirumala: తిరుమలకు వెళ్లే వారికి తీపికబురు.. వెనువెంటనే స్వామి వారి దర్శనం
తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది.
తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. స్వామి వారి దర్శనం సులువుగా అవుతుంది. సంక్రాంతి పండగను దేశమంతా ప్రజలు జరుపుకుంటుడటంతో తిరుమలకు భక్తుల రద్దీ తగ్గింది. నేడు భోగి నుంచి కనుమ వరకూ తిరుమలలో రద్దీ తక్కువగానే ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. కేవలం తిరుపతి, చిత్తూరు జిల్లాలకు చెందిన స్థానికులు పండగ వేళ స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే అవకాశముందని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారు తక్కువగా ఉంటారని భావిస్తుంది.
మూడు రోజుల పాటు...
సహజంగా సంక్రాంతి పండగ మూడు రోజుల పాటు తిరుమలలో రద్దీ తక్కువగానే ఉంటుంది. సంక్రాంతి పండగను సొంతూళ్లలో బంధుమిత్రుల మధ్య జరుపుకోవడం సంప్రదాయంగా వస్తుంది. అందుకే తిరుమలకు వచ్చే వారి సంఖ్య తక్కువగా ఉంటుంది. ఇటీవల కాలంలో తిరుమలకు వచ్చే వారి భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా స్వామి వారి హుండీ ఆదాయం కూడా గణనీయంగా పెరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. అన్నదానానికి హాజరయ్యే భక్తుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది.
నాలుగు కంపార్ట్ మెంట్లలోనే...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని నాలుగు కంపార్ట్ మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి నేడు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం కేవలం నాలుగు గంటల సమయం మాత్రమే పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టోకెన్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం గంటలోపే పూర్తవుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 73,014 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 19,639 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం4.27 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.