Tirumala : తిరుమలలో నేడు క్యూ లైన్ ఎంత పొడవుందంటే?
తిరుమలలో నేడు భక్తుల రద్దీ పెరిగింది
తిరుమలలో నేడు భక్తుల రద్దీ పెరిగింది. బయట వరకూ క్యూ లైన్ విస్తరించింది. వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు తరలి వచ్చారు. భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని చర్యలను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తీసుకుటున్నారు. క్యూ లైన్ లో ఉన్న భక్తులకు శ్రీవారి సేవకులు అన్న ప్రసాదం, మజ్జిగ, మంచినీరు, పాలు క్యూ లైన్ లో ఉన్నభక్తులకు అందిస్తున్నారు.భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు టీటీడీ అధికారులు తీసుకుంటున్నారు.
నేడు ప్రణయ కలహోత్సవం...
తిరుమలలోవేంకటేశ్వరస్వామి వారు తన దేవేరులతో కలిసి పాల్గొనే కలహ శృంగార భరితమైన ప్రణయ కలహోత్సవం జనవరి 4వ తేదీ తిరుమలలో జరుగనుంది. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని సాయంత్రం 4 గంటలకు స్వామివారు, అమ్మవార్ల ఉత్సవమూర్తులు బంగారు పల్లకీలపై వేరువేరుగా వైభవోత్సవ మండపం నుంచి ఊరేగింపుగా బయలుదేరి శ్రీ వరాహస్వామి ఆలయం వద్ద ఒకరికొకరు ఎదురేగుతారు. ఇక్కడ అర్చకులు స్వామి, అమ్మవార్ల తరఫున వేరువేరుగా ఆళ్వారు దివ్యప్రబంధంలోని పాశురాలను స్తుతిస్తారు. ఆ తరువాత అమ్మవార్లు స్వామివారిని నిందాస్తుతి చేసిన అనంతరం ఒకరిపై ఒకరు పూల బంతులను విసరడం, స్వామివారు పుష్పఘాతం నుండి తప్పించుకోవడం వంటి ఆసక్తికరమైన సన్నివేశాలతో ఈ ప్రణయకలహ మహోత్సవం నిర్వహిస్తారు.
హుండీ ఆదాయం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లలో భక్తులు నిండిపోయారు. బయట శిలా తోరణం వరకూ క్యూ లైన్ విస్తరించింది. దాదాపు రెండు కిలోమీటర్ల మేర క్యూ లైన్ ఉంది. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పదిహేను గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారిని 88,662 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 24,417 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 5.05 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.