Tirumala : తిరుమల కొండకు వెళ్లే వారు అప్రమత్తం.. క్యూ లైన్ ఎంత పొడవంటే?

తిరుమలలో భక్తుల రద్దీ నేడు కొనసాగుతుంది

Update: 2026-01-08 03:08 GMT

తిరుమలలో భక్తుల రద్దీ నేడు కొనసాగుతుంది. నేటితో వైకుంఠ ద్వార దర్శనాలు ముగియనున్నాయి. దీంతో భక్తుల పెద్ద సంఖ్యలో తిరుమలకు తరలి వచ్చారు. ఇక కొత్త ఏడాది కావడంతో పాటు వైకుంఠ ద్వార దర్శనానికి నేడు ఆఖరి రోజు కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తారని భావించి అందుకు తగిన ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చేపట్టారు. నిన్న రాత్రి నుంచి తిరుమలకు భక్తుల రాక పెరగడంతో ఘాట్ రోడ్డులోనూ వాహనాలు ఎక్కువగా కనిపిస్తుండటంతో పలు చర్యలు తీసుకున్నారు.

నేటితో వైకుంఠ ద్వార దర్శనాలు...
కొండపైన పార్కింగ్ కూడా కష్టంగా మారిందని అధికారులు చెబుతున్నారు. కొందరు వాహనాలను రోడ్లపైనే ఉంచి దర్శనానికి వెళుతున్నారు. నేటి అర్థరాత్రి పన్నెండు గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలను తిరుమలలో మూసివేయనున్నారు. రేపటి నుంచి ఆర్జిత సేవలతో పాటు ప్రత్యేక దర్శన టిక్కెట్లు కూడా అందుబాబాటులోకి వస్తాయని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఈ నెల 30వ తేదీన ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు పది రోజుల పాటు ప్రశాంతంగా సాగాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.
శిలా తోరణం వరకూ...
మరొకవైపు ఈరోజు తిరుమలలోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూ లైన్ రెండు కిలోమీటర్ల వరకూ విస్తరించింది. భక్తుల క్యూ లైన్ శిలాతోరణం వరకూ విస్తరించింది. సర్వదర్శనం క్యూ లైన్ లో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం పది నుంచి పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారిని 85,752 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 19,443 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.69 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.




Tags:    

Similar News