Tirumala : తిరుమలలో రికార్డు స్థాయిలో భక్తులు.. స్వామి దర్శనానికి?

తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది

Update: 2026-01-03 03:38 GMT

తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది. వైకుంఠ ద్వార దర్శనాలకు భక్తులు పోటెత్తారు. అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. రెండు కిలోమీటర్లకు పైగానే భక్తుల క్యూ లైన్ కనపడుతుంది. దీంతో భక్తుల రద్దీతో తిరుమల కిటకిట లాడుతుంది. టోకెన్లు లేకుండా వైకుంఠద్వార దర్శనాలకు భక్తులను అనుమతించడంతో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. క్యూ లైన్ లో ఉన్న భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.

పౌర్ణమి గరుడ వాహన సేవ రద్దు...
నేడు పౌర్ణమి గరుడ వాహన సేవను కూడా తిరుమల దేవస్థానం అధికారులు రద్దు చేశారు. తిరుమలకు రికార్డు స్థాయిలో భక్తులు చేరుకోవడంతో అందరికీ దర్శనం కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు. రోజు వారీ దర్శనం చేసుకునే వారికంటే నిన్న అదనంగా పదిహేను వేల మందికి దర్శనాన్ని అధికారులు కల్పించారు. తిరుమల మాడ వీధులు గోవింద నామస్మరణలతో మారుమోగిపోతున్నాయి. వసతి గృహాలు దొరకడం కూడా భక్తులకు కష్టంగా మారింది.
హుండీ ఆదాయం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట శిలాతోరణం వరకూ భక్తుల క్యూ లైన్ విస్తరించింది. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారిని 83,032 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 27,372 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.10 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News