Tirumala : తిరుమలకు వెళ్లే వారికి టీటీడీ చెప్పేదేంటంటే?

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది

Update: 2026-01-20 03:28 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గత కొద్ది రోజుల నుంచి భక్తుల రద్దీ తిరుమలలో ఎక్కువగా ఉంది. సంక్రాంతి సెలవులు కావడంతో వరసగా తిరుమలకు భక్తులు చేరుకుని స్వామి వారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు.తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో వారికి అవసరమైన ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమలకు వచ్చిన భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటు్న్నారు. దీంతో పాటు అన్నప్రసాదం, మజ్జిగ, మంచినీటిని పంపిణీ చేస్తున్నారు.

భక్తుల తాకిడితో...
సంక్రాంతి సెలవుల సందర్భంగా తిరుమలకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. ఒకరకంగా చెప్పాలంటే వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమయి ముగిసేంత వరకూ తర్వాత కూడా తిరుమలలో అదే రద్దీ కొనసాగుతుంది. గత కొద్ది రోజులుగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో శ్రీవారి హుండీ ఆదాయం కూడా పెరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. తిరుమలకు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధికంగా తరలి వస్తున్నారని, ఇదే పరిస్థితి మరికొంత కాలం కొనసాగే అవకాశముందని టీటీడీ అధికారులు తెలిపారు.
ఇరవై కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఇరవై కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించే భక్తులకు స్వామి వారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు మూడు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు గంటల్లో పూర్తవుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 79,098 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 24,083 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.16 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News