Tirumala : నేడు తిరుమలకు వెళ్లే వారికి హై అలెర్ట్.. ఒక రోజంతా

తిరుమలలో భక్తుల రద్దీ నేడు ఎక్కువగా ఉంది.

Update: 2026-01-17 03:04 GMT

తిరుమలలో భక్తుల రద్దీ నేడు ఎక్కువగా ఉంది. గత రెండు రోజుల నుంచి భక్తుల రద్దీ తిరుమలలో ఎక్కువయింది. వరసగా సంక్రాంతి సెలవులు రావడంతో కొండ భక్తులతో నిండిపోయింది. తిరుమలలో వీధులన్నీ గోవింద నామ స్మరణలతో మారుమోగిపోతున్నాయి. కంపార్ట్ మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. బయట వరకూ క్యూ లైన్ విస్తరించి ఉండటంతో శ్రీవారి సేవకులు వారికి ఉచితం అన్న ప్రసాదాలను, మంచినీటిని, పాలను, మజ్జిగను పంపిణీ చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.

వసతి గృహాలు దొరకక...
తిరుమలలో ఏ సెలవులు ఏ రూపంలో వచ్చినప్పటికీ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల కాలంలో తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. వసతి గృహాలు కూడా దొరకడం లేదు. అందుకే అలిపిరి వద్దనే కొత్తగా వసతి గృహాలను నిర్మించాలని టీటీడీ భావిస్తుంది. తిరుమలకు వచ్చేభక్తుల సంఖ్య రోజుకు ఎనభై వేల మందికి పైగానే ఉండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వారికి అవసరమైన ఏర్పాట్లు చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
శిలాతోరణం వరకూ...
నేడు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లలో భక్తులు నిండిపోయారు. బయట శిలా తోరణం వరకూ భక్తుల క్యూ లైన్ విస్తరించింది. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై నుంచి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఆరు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 78,733 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 31,146 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.41 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News