Investment scam :సైబర్ మోసగాళ్లకు చిక్కి రూ.24.5 లక్షలు కోల్పోయిన రిటైర్డ్ సివిల్ ఇంజనీర్
ప్రభుత్వ స్కీమ్‌గా నమ్మబలికి మోసం నకిలీ ట్రేడింగ్ సైట్ ద్వారా రూ.26 లక్షల మోసం
హైదరాబాద్: రామకోటికు చెందిన 75 ఏళ్ల రిటైర్డ్ సివిల్ ఇంజనీర్ సైబర్ మోసగాళ్లకు రూ.24.5 లక్షలు కోల్పోయినట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్‌ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రమోట్ చేసినట్లు చూపించిన నకిలీ వీడియోని నమ్మి ఈ నష్టాన్ని చవిచూశానని జితేంద్రకుమార్ ప్రతాపరాయ్ కపాశీ అనే వృద్ధుడు తెలిపారు.
నకిలీ వీడియో, లింక్ ద్వారా మోసం
సెప్టెంబర్ 9న యూట్యూబ్‌లో సీతారామన్ మాట్లాడుతున్నట్లుగా కనిపించిన వీడియో చూసి అందులోని లింక్‌ను క్లిక్ చేశానని జితేంద్ర తెలిపారు. తరువాత ఆయనకు ఫోన్ చేసి www.tradgrip.com వెబ్‌సైట్‌లో రిజిస్టర్ కావాలని సూచించారని చెప్పారు. ప్రారంభంలో క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపులు చేయమని, తరువాత భారత్‌లోని అనేక బ్యాంకు ఖాతాలకు నిధులు బదిలీ చేయమని సూచించారని వివరించారు.
రూ.26.36 లక్షలు పంపించి రూ.1.77 లక్షలే తిరిగి....
సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 16, 2025 మధ్య వివిధ ఖాతాలకు మొత్తంగా రూ.26.36 లక్షలు జమ చేశానని, అందులో నుంచి కేవలం రూ.1.77 లక్షలే వాయిదాలుగా తిరిగి వచ్చాయని ఆయన తెలిపారు. ఆప్‌లో 34,000 అమెరికన్ డాలర్ల లాభం చూపించగా, విత్‌డ్రా చేయాలంటే ఖాతాను “సిల్వర్” నుండి “గోల్డ్”కు అప్‌గ్రేడ్ చేయాలని, అదనంగ 15,000 డాలర్లు చెల్లించాలన్నారు. అనుమానం రావడం అక్టోబర్ 16న ట్రేడింగ్ ఆపేశానని, అప్పటి నుంచి వారితో సంప్రదింపులు నిలిపేశానని ఫిర్యాదులో పేర్కొన్నారు.
మోసగాళ్లను గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరిన జితేంద్ర ఫిర్యాదుపై సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ ప్రారంభించారు. సంబంధిత ఐటీ చట్టం, ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసే అంశం పరిశీలనలో ఉందని అధికారులు తెలిపారు.