Online Trading Scam: సినిమా నిర్మాతగా నటించి మోసం బంజారాహిల్స్ వైద్యురాలికి ₹6.2 లక్షల నష్టం
వైద్యురాలిని సినిమా నిర్మాతగా పరిచయం చేసుకున్న వ్యక్తి స్టాక్ ట్రేడింగ్‌లో అధిక లాభాలు ₹6.20 లక్షలు తీసుకున్నాడు
హైదరాబాద్: నగరంలోని బంజారా హిల్స్ ప్రాంతానికి చెందిన 33 ఏళ్ల వైద్యురాలిని సినిమా నిర్మాతగా పరిచయం చేసుకున్న వ్యక్తి మోసం చేశాడు. స్టాక్ ట్రేడింగ్‌లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మబలికి మొత్తం ₹6.20 లక్షలు తీసుకున్నాడు. ఈ ఘటనపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు నమోదైంది.
ఫిర్యాదు ప్రకారం… వైద్యురాలు అక్టోబర్ 1, 2025న ఓ ఆన్‌లైన్ వేదికలో అపరిచితుడితో పరిచయం అయ్యింది. అతను తన పేరు “మహేష్” అని, తాను సినిమా నిర్మాతనని చెప్పాడు. తర్వాత వాట్సాప్ ద్వారా మాట్లాడడం ప్రారంభించాడు. స్టాక్ ట్రేడింగ్, ఇతర పెట్టుబడి పథకాల పేరుతో అధిక లాభాలు వస్తాయని హామీ ఇచ్చాడు.
అతని మాటలు నమ్మిన ఆమె పలు దఫాల్లో డబ్బులు పంపింది. తన ICICI Bank ఖాతా నుంచి మొత్తం ₹6,20,000 బదిలీ చేసింది. పెట్టిన మొత్తం తో పాటు లాభాలు ఇవ్వాలని కోరగా నిందితుడు తిరస్కరించాడు. అనంతరం ఆమె ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేశాడు.
పది లావాదేవీలు… డిసెంబర్ నుంచి జనవరి మధ్య
పోలీసుల వివరాల ప్రకారం డిసెంబర్ 28, 2025 నుంచి జనవరి 16, 2026 మధ్య బాధితురాలు పది సార్లు డబ్బులు పంపింది. ఒక్కో లావాదేవీ ₹9,999 నుంచి ₹89,900 మధ్య జరిగింది. మొత్తం నగదు ఐసీఐసీఐ బ్యాంకు ఖాతా నుంచి డెబిట్ అయ్యింది. నిందితుడు రెండు మొబైల్ నంబర్లతో బాధితురాలితో సంప్రదింపులు కొనసాగించినట్లు తెలిపారు.
మోసపోయినట్లు గ్రహించిన వైద్యురాలు జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు ఫిర్యాదు చేసింది. అనంతరం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని, నిందితుడిని గుర్తించి డబ్బు రికవరీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు.