ఏటీఎమ్ ట్రావెల్స్ ఎయిర్లైన్ టిక్కెటింగ్ సిస్టం హాక్ ......రూ.26.5 లక్షల నష్టం
సెప్టెంబర్ 14 అర్ధరాత్రి నుంచి 16 మధ్యాహ్నం వరకు గుర్తు తెలియని వ్యక్తులు కంపెనీకి చెందిన బీటా వెబ్‌సైట్ చొరబడి, అనుమతి లేకుండానే అనేక ఎయిర్ టికెట్లు జారీ
ఆన్‌లైన్ టికెటింగ్ పోర్టల్ ద్వారా భారీ మోసం జరిగినట్లు ఏక్రాస్ ది మోండ్ ట్రావెల్ అండ్ టూర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఫిర్యాదు చేసింది. ఈ సంస్థ డైరెక్టర్ సుజాత సిసీలియా దేవగిరి (56) ఇచ్చిన లిఖిత ఫిర్యాదు ప్రకారం సెప్టెంబర్ 14 అర్ధరాత్రి నుంచి 16 మధ్యాహ్నం వరకు గుర్తు తెలియని వ్యక్తులు కంపెనీకి చెందిన బీటా వెబ్‌సైట్ (www.atmtravels.com)లోకి చొరబడి, అనుమతి లేకుండానే అనేక ఎయిర్ టికెట్లు జారీ చేసినట్లు తెలిపారు.
సంస్థ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (IATA) లైసెన్స్‌తో, ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (TAAI) సభ్యత్వంతో పనిచేస్తోంది. గెలిలియో, ఇండిగో, ఆర్‌ఐఏ కనెక్ట్ వంటి గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (GDS)ల ద్వారా టికెటింగ్ కోసం రూ.1 కోటి బ్యాంక్ గ్యారంటీని కలిగి ఉందని ఫిర్యాదులో పేర్కొంది.
సెప్టెంబర్ 16న మధ్యాహ్నం 1 గంట సమయంలో ఈ అక్రమ టికెట్ల జారీ బయటపడిన వెంటనే సంస్థ వెబ్ యాక్సెస్ నిలిపివేసి, ఆ సమయంలో జారీ అయిన అన్ని టికెట్లను రద్దు చేసింది. అయినప్పటికీ రూ.26,54,165 నష్టం వాటిల్లిందని పేర్కొంది.
30కి పైగా టికెట్ల జారీ
టర్కిష్ ఎయిర్‌లైన్స్, ఇండిగో, ఎయిర్‌ఇండియా, ఫ్లైదుబాయ్, సింగపూర్ ఎయిర్‌లైన్స్, డెల్టా, ఇథియోపియన్, ఏపీజీ ఎయిర్‌లైన్స్ పేర్లతో సుమారు 30కి పైగా టికెట్లు జారీ అయినట్లు తెలిపారు. వీటిలో లాగోస్–ఇస్తాంబుల్–రియాద్, అబుజా–దోహా, ఢిల్లీ–వాంకూవర్, ఢిల్లీ–మెల్బోర్న్, అబిడ్జాన్–లాగోస్ వంటి అంతర్జాతీయ రూట్లు ఉన్నాయి. ప్రయాణికుల వివరాలు ఎక్కువగా విదేశీ ఇమెయిల్ (@proton.me) అడ్రెసులు, ఫోన్ నంబర్లతో ఉన్నాయని సంస్థ తెలిపింది. ఇప్పటివరకు ఎటువంటి మొత్తమూ తిరిగి రాలేదని వివరించింది.
ఎఫ్ఐఆర్ నమోదు కోరుతూ ఫిర్యాదు
డేటా లీక్, అనధికార ప్రవేశం, ఆర్థిక నష్టం అంశాలపై తక్షణ చర్య తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ దేవగిరి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు NCRP నంబర్ 23709250057212 కింద నమోదైంది.
పోలీసులు డిజిటల్ లాగ్స్, ట్రాన్సాక్షన్లు పరిశీలించిన తరువాత ఐటీ చట్టం, ఐపీసీ సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తామని తెలిపారు.