ఉద్యోగం లేదని ఫ్రస్టేషన్.. భార్య షాపింగ్ చేసిందని కోపం.. వెరసి మర్డర్

బెంగళూరులో భార్య తనకు తెలియకుండా షాపింగ్ కు వెళ్లిందని ఆగ్రహించి భర్త కోపంతో భార్యను చంపేసిన ఘటన కలకలం రేపింది.

Update: 2025-07-10 06:32 GMT

కుటుంబ బంధాలు పూర్తిగా కనుమరుగైపోతున్నాయి. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమైన సమయంలో భార్యా భర్తలు ఒక ఇంట్లో ఉండి శత్రువులుగా మారుతున్నారు. ఇద్దరి మధ్య రాజీ కుదర్చడానికి కూడా పెద్దలు లేకపోవడంతో గ్యాప్ పెరిగి చివరకు హత్యలకు దారితీస్తున్నాయి. చిన్న చిన్న కారణాలతో విడిపోయే వారు కొందరయితే.. మరికొందరు క్షణికావేశంలో చంపేస్తున్నారు. ఇంకొందరు ప్లాన్ చేసి మర్డర్ చేస్తున్నారు. తాజాగా బెంగళూరులో భార్య తనకు తెలియకుండా షాపింగ్ కు వెళ్లిందని ఆగ్రహించి భర్త కోపంతో భార్యను చంపేసిన ఘటన కలకలం రేపింది.

ఇద్దరూ ఉద్యోగులే...
బెంగళూరులోని బొమ్మనహళ్లి ప్రాంతంలో హరీశ్, పూజ ఉంటున్నారు. వీరికి వివాహం అయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇద్దరూ ఇంజినీరింగ్ చేసి ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం కూడా చేస్తున్నారు. అయితే హరీశ్ కొన్ని నెలల క్రితం అనేక కారణాలతో ఉద్యోగం మానేశాడు. ఇంట్లోనే ఉంటున్నారు. పూజ మాత్రం ఉద్యోగం చేస్తూ ఇల్లు గడుపుతుంది. అయితే సహజంగానే ఇద్దరి మధ్య ఆర్థిక పరమైన గొడవలు వస్తున్నాయి. మళ్లీ పోతుున్నాయి. అసలే ఉద్యోగం లేక ఇంట్లోనే ఉంటున్నానని ఫ్రస్టేషన్ లో ఉన్న హరీశ్ కు భార్య షాపింగ్ వెళ్లడం కాలిపోయింది.
గొంతుపై కాలు వేసి నొక్కి...
ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే షాపింగ్ కు వెళ్లి అనవసరమైన వస్తువులను కొనుక్కుని వస్తావా? అని ఆగ్రహంతో హరీశ్ పూజపై ఊగిపోయాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. తనకు ఎదురు సమాధానం చెప్పడంతో తట్టుకోలేకపోయిన హరీశ్ ఆమెపై చేయి చేసుకున్నాడు. అంతే కాదు నేలపై పడేసి కాలితో ఆమె గొంతుపై బలంగా నొక్కాడు. దీంతో పూజ మరణించింది. అయితే పూజ మరణించిందన్న సమాచారాన్ని పోలీసులకు స్థానికులు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి హరీశ్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూజ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


Tags:    

Similar News