సీరియల్ కిల్లర్ దొరికాడు.. క్యాబ్ డ్రైవర్లే టార్గెట్

గత ఇరవై అయిదేళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న సీరియల్ కిల్లర్ అజయ్ లాంబా ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు

Update: 2025-07-07 05:26 GMT

హమ్మయ్య.. సీరియల్ కిల్లర్ దొరికాడు. ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత ఇరవై అయిదేళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న సీరియల్ కిల్లర్ అజయ్ లాంబా ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. అయితే ఇతను కేవలం వ్యాబ్ డ్రైవర్లను మాత్రమే హత్య చేస్తాడు. అద్దెకు ట్యాక్సీలను తీసుకోవడం నిర్మానుష్య ప్రదేశంలోకి వెళ్లిన వెంటనే డ్రైవర్లను నిర్దాక్షిణ్యంగా చంపేయడం, తర్వాత అటవీ ప్రాంతాల్లో విసిరేయడం అతను అలవాటుగా మార్చకున్నాడు. తాను అద్దెకు తీసుకున్న వాహనాన్ని అజయ్ లాంబా అలియాస్ బన్షీ నేపాల్ లో విక్రయించేవాడు.

గుట్టు చప్పుడు కాకుండా...
గుట్టు చప్పుడు కాకుండా అనేక రాష్ట్రాల్లో క్యాబ్ డ్రైవర్లను హత్య చేసి పోలీసుల రికార్డుల్లో మోస్ట్ వాంటెడ్ గా నిలిచాడు. ఈ కిరాతకుడు అనేక వేషాలు వేస్తూ ఇరవై ఐదేళ్లుగా తప్పించుకుని తిరుగుతున్నాడు. పోలీసులు కూడా ఎంత ప్రయత్నించినా వారి ఆచూకీ దొరకలేదు.అయితే గంజాయి విక్రయిస్తుండగా అజయ్ లాంబాను అరెస్ట్ చేయడంతో వీడి పూర్వ చరిత్ర కూడా బయటపడింది. అజయ్ లాంబాపై ఉత్తరాఖండ్, డిల్లీ రాష్ట్రాల్లో నాలుగు దోపిడీలు, అనేక హత్య కేసులు నమోదయ్యాయి. ఆరోతరగతి చదివి మానేసిన ఢిల్లీలోని కృష్ణానగర్ లో నివాసముండేవాడు.
దోపిడీలకు పాల్పడుతూ...
నేరాలకు అలవాటుపడిపోయిన తను ఢిల్లీ, హల్ద్వానీ, అల్మోరా, చంపావత్ లలో దోపిడీలతో పాటు హత్యలకు కూడా పాల్పడ్డాడు. అయితే చాలా తెలివిగా పోలీసుల కన్ను గప్పి తప్పించుకునే వాడు. ఇక 2008 నుంచి 2018 వరకూ తన కుటుంబంతో సహానేపాల్ లోనే నివాసమున్నాడు. తర్వాత ఉత్తరాఖండ్ కు వచ్చి అక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. 2020లో డ్రగ్స్ రవాణాలోకి కూడా మారి తన ఆదాయాన్ని పెంచుకున్నాడు. గతంలో రెండుసార్లు అరెస్టయినా బెయిల్ పై బయటకు వచ్చిన అజయ్ లాంబా చివరకు గంజాయి కేసులో అరెస్ట్ చేయడంతో వీడి కథంతా బయటకు వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags:    

Similar News