Rajkot : ప్రజల ప్రాణాలతో గేమ్సా? ఉసురు తీసిన నిర్లక్ష్యం..రాజ్‌కోట్ ప్రమాదానికి అసలు కారణం ఇదేనట

రాజ్‌కోట్ ప్రమాదం ఊహించని రీతిలో జరిగింది. 27 మంది ఉసురు తీసింది

Update: 2024-05-26 02:18 GMT

రాజ్‌కోట్ ప్రమాదం ఊహించని రీతిలో జరిగింది. 27 మంది ఉసురు తీసింది. సాయంత్రం వేళ సరదాగా గడిపేందుకు వెళ్లిన వారికి అది డెత్ గేమింగ్ గా మారింది. గుజరాత్ లోని రాజ్ కోట్ లో నిన్న సాయంత్రం గేమింగ్ జోన్ లో చెలరేగిన మంటలకు 27 మంది మరణించారు. మంటలు వ్యాపించడంతో పై కప్పు కూలడంతో ఈ విషాదం తీవ్రత ఎక్కువయింది. తప్పించుకునే ప్రయత్నమూ ఫలించలేదు. రక్షించడానికి కూడా ఎవరూ సాహసించలేని పరిస్థితి. చుట్టూ మంటలు.. రక్షించడానికి వెళితే తాము మాడి మసై పోతారు. అందుకే ఇంత పెద్దయెత్తులో ప్రాణ నష్టం సంభవించింది. ఇప్పటి వరకూ 27 మృతదేహాలను వెలికి తీశారు. ఇంకా ఉండవచ్చన్న అనుమానాలను వ్యక్తమవుతున్నాయి. మృతుల్లో నలుగురు చిన్నారులున్నారు. మృతదేహాలను గుర్తించడం కూడా కష్టంగా మారింది. చిన్నారులతో సాయంత్రం వేళ సరదాగా వచ్చిన వారి పాలిట గేమింగ్ జోన్ శాపంగా మారింది. మృత్యువు వారితో ఆడుకున్నట్లయింది.

ఎలాంటి అనుమతులు లేకుండా...
రాజ్‌కోట్ లోని టీఆర్పీ గేమింగ్ జోన్ యువరాజ్ సింగ్ అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు. అయితే ఎలాంటి అనుమతులు లేకుండా ఈ గేమింగ్ జోన్ ను నిర్వహిస్తున్నాడని అధికారులు కనుగొన్నారు. యువరాజ్ సింగ్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. యువరాజ్ సింగ్ తో పాటు గేమింగ్ జోన్ మేనేజర్ నితిన్ జైన్ తో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని ప్రభుత్వం చెప్పింది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలోనూ కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మృతుల కుటుంబాలకు నాలుగు లక్షలు, క్షతగాత్రులకు యాభై వేల రూపాయల నష్టపరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది.
అదే కారణమా?
అయితే ప్రమాదం మాత్రం గేమింగ్ జోన్ లో ఉన్న ఏసీలు ఒకటి పేలడంతోనే ఈ ప్రమాదం సంభవించినట్లు ప్రాధమికంగా అగ్నిమాపక సిబ్బంది గుర్తించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఏసీ పేలిందని చెబుతున్నారు. దీనిని గమనించని ఎక్కువ మంది ఆటలలో నిమగ్నమయి ఉండటం.. ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టడం, పై కప్పు పడిపోవడంతో ఇంతటి ఘోర విపత్తు జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. గేమింగ్ జోన్ నిర్వహణ సక్రమంగా లేదన్న ఆరోపణలున్నాయి. ఇందుకు బాధ్యులైన దాని యజమానులతో పాటు వారికి సహకరించిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినపడుతుంది. మొత్తం మృత్యువు ఆ రూపంలో వస్తుందని ఊహించని వారంతా గేమ్స్ ఆడేందుకు వెళ్లి ఇలా మృత్యువాత పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News