Nellore : రౌడీషీటర్లకు అడ్డాగా మారిన నెల్లూరు.. రీజన్ ఇదేనా?
నెల్లూరు ఇటీవల కాలంలో రౌడీషీటర్లకు నిలయంగా మారింది.
నెల్లూరు ఒకప్పుడు ప్రశాంతంగా ఉండేది. పచ్చని పొలాలు.. పెన్నా నీటితో పండే ధాన్యపు సిరులతో కళకళలాడేది. అలాంటి నెల్లూరు ఇటీవల కాలంలో రౌడీషీటర్లకు నిలయంగా మారింది. నెల్లూరు కంటే పొరుగున ఉన్న ఒంగోలులో రౌడీషీటర్లు 1980వ దశకంలో ఎక్కువగా ఉండేవారు. సుపారీ గ్యాంగ్ లు కూడా ఒంగోలులో ఎక్కువగా ఉండేవి. హత్యలు, అత్యాచారాలు ఎక్కువగా ఒంగోలు ప్రాంతంలోనే జరిగేవి. కానీ మారుతున్న కాలక్రమంలో ఇప్పుడు ఆ జబ్బు ఒంగోలు నుంచి పక్కనే ఉన్న నెల్లూరుకు అంటుకున్నట్లే కనిపిస్తుంది. నెల్లూరులో రౌడీషీటర్లు ఎక్కువగా కనిపిస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లోనూ సుపారీ గ్యాంగ్ లుగా నెల్లూరోళ్లనే ఎంచుకుంటున్నారు.
ఒంగోలు నుంచి షిఫ్ట్ అయినట్లుందిగా...
ఒంగోలు కొద్దిగా శాంతి భద్రతల విషయంలో సరైన దారిలో పయనిస్తుండగా నెల్లూరు మాత్రం గాడి తప్పిందన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చెన్నైకి సమీపంలో ఉన్న నెల్లూరులో ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడే వారు ఎక్కువ. అలాగే బంగారు వ్యాపారులు కూడా అధికమే. అనేక మంది కళాకారులకు కూడా నాడు నెల్లూరు నిలయంగా ఉండేది. దివంగత ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం అక్కడ జన్మించి తన పాటలతో దేశాన్ని ఉర్రూతలూగించారు. ఇక సినిమా నటులకు కూడా నెల్లూరులో కొరతలేదు. చెన్నై పక్కనే ఉండటంతో ఉపాధి కోసం కూడా యువత ఎక్కువగా అక్కడకు వెళ్లి కష్టపడి పనిచేసుకుంటూ జీవనం సాగించే వారు.
అనేక హత్య కేసుల్లో...
కానీ నెల్లూరులో నేడు రౌడీ గ్యాంగ్ లు పెరిగిపోయాయి. రాజకీయ నాయకుల అండదండలతోనే ఈ రౌడీషీటర్లు చెలరేగిపోతున్నారంటున్నారు. ఇటీవల నెల్లూరు సుపారీ గ్యాంగ్ ఒంగోలులో తెలుగుదేశం పార్టీ నేత వీరయ్య చౌదరి హత్యలోనూ నెల్లూరు గ్యాంగ్ ప్రమేయం ఉందని అందరికీ తెలిసిందే. అలాగే మలక్ పేట్ లో జరిగిన చందు రాథోడ్ హత్య కేసులో కూడా నెల్లూరోళ్ల ప్రమేయం ఉందని పోలీసులు అనుమానించారు. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ హత్యలు జరిగినా నెల్లూరు రౌడీ షీటర్ల ప్రమేయం ఉండటం కొంత ఆందోళన కలిగిస్తుంది. అక్కడ శాంతిభద్రతల వైఫల్యంతో పాటు రాజకీయ నాయకుల వైఖరి గతంలో కంటే మార్పు కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.
తాజాగా జరిగిన పరిణామాలు...
ఇటీవల రౌడీషీటర్ శ్రీకాంత్, అరుణల వ్యవహారం కూడా నెల్లూరులో కలకలం రేపింది. ఈ ఇద్దరి వెనక రాజకీయ నేతలు, పోలీసు అధికారుల ప్రమేయం ఉందన్న విషయమూ గుర్తించారు. శ్రీకాంత్ పెరోల్ విషయమూ వివాదంగా మారిన నేపథ్యంలో తాజాగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ని హతమారిస్తే డబ్బులే డబ్బులంటూ రౌడీషీటర్లు మాట్లాడుకున్న వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో శ్రీకాంత్ అనుచరుడు జగదీష్ తో పాటు మరికొందరు అనుచరులున్నారు. దీంతో నెల్లూరు రౌడీషీటర్లకు అడ్డాగా మారిందని పోలీసు రికార్డుల్లోకి కూడా ఎక్కింది. అయితే రౌడీషీటర్లు, రౌడీ మూకలు, సుపారీ గ్యాంగ్ లు పేట్రేగిపోవడానికి ప్రధాన కారణం పోలీసుల వైఫల్యమేనన్న కామెంట్స్ వినపడుతున్నాయి.