Murder Case : ఐదడుగుల గోతిలో భర్త శవం.. తీరా హత్యచేసింది ఎవరో తెలిసి?
భార్య కట్టుకున్న భర్తను హత్య చేసి ఐదడుగుల గొయ్యలో పాతిపెట్టిన ఘటన అస్సాం రాజధాని గౌహతిలో జరిగింది
భార్య కట్టుకున్న భర్తను హత్య చేసి ఐదడుగుల గొయ్యలో పాతిపెట్టిన ఘటన అస్సాం రాజధాని గౌహతిలో జరిగింది. చుట్టుపక్కల వారికి అనుమానం రాకుండా తన భర్త పని నిమిత్తం కేరళ వెళ్లినట్లు నమ్మబలికింది. అయితే మృతుడి సోదరుడికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా అసలు విషయం బయటపడింది. తానే భర్తను హత్య చేసి ఇంటి ఆవరణలోని గోతిలో పాతి పెట్టినట్లు ఒప్పుకుంది. గౌహతికి చెందిన హీమా ఖాతూన్, నబియాల్ రహ్మాన్ లకు పదిహేనేళ్ల క్రితం వివాహమయింది. వారికి ఇద్దరు పిల్లలున్నారు.
పదిహేనేళ్ల క్రితం పెళ్లయి...
గౌహతిలోని పాండు ప్రాంతంలోని జోయ్ మతినగర్ లో నివసిస్తున్నారు. గత నెల 26వ తేదీన భార్యా భార్తల మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది. అది చినికి చినికి గాలివానలా మారింది. దీంతో భర్త సబియాల్ రెహ్మాన్ ను భార్య హీమా ఖాతూన్ కొట్టడంతో మద్యం మత్తులో ఉన్న అతను మరణించాడు. ఏం చేయాలో తెలియనిరరహీమా ఖాతూన్ ఏం చేయాలో తెలియక తొలుత కంగారు పడి తర్వాత తేరుకుని తన ఇంటి ఆవరణలో గోయి తీసి పాతి పెట్టింది. భర్త పని నిమిత్తం కేరళకు వెళ్లినట్లు చెప్పింది. అయితే అనుమానం రావడంతో ఆసుపత్రికి వెళ్లి వస్తానని హీమా ఖాతూన్ పారిపోయింది.
సోదరుడి ఫిర్యాదుతో...
సబియాల్ రెహ్మాన్ కనిపించకపోవడంతో అతని సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హీమా ఖాతూన్ పై అనుమానం వ్యక్తం చేశారు. అయితే రెండు రోజుల క్రితం హీమా ఖాతూన్ పోలీసుల ఎదుటకు వచ్చి తానే స్వయంగా లొంగిపోయింది. ఇంట్లో తమిద్దరి మధ్య తలెత్తిన విభేదాల వల్ల ఘర్షణ జరిగిందని, ఇద్దరం కొట్టుకోవడంతో భర్త మరణించాడని హీమా ఖాతూన్ పోలీసులకు తెలిపింది. దీంతో భర్త శవాన్ని తాను ఇంటి ఆవరణలో పూడ్చిపెట్టినట్లు అంగీకరించింది. మృతదేహాన్ని వెలికి తీసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హీమా ఖాతూన్ కు ఎవరైనా సహకరించారా? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.