ముంబయిలో విషాదం.. బస్సు ఢీకొని నలుగురి మృతి
ముంబయిలో విషాదం నెలకొంది. బస్సు ఢీకొని నలుగురు మరణించారు
ముంబయిలో విషాదం నెలకొంది. బస్సు ఢీకొని నలుగురు మరణించారు. ముంబయి నగర పాలక సంస్థ ఆధ్వర్యంలోని బెస్ట్ బస్సు రివర్స్‌లో వస్తూ పాదచారులను ఢీకొట్టడంతో ముగ్గురు మహిళలు సహా నలుగురు మృతి చెందారు. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. ఈ ఘటన సోమవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో బాందుప్ స్టేషన్ రోడ్డులో జరిగింది. ప్రమాదంలో గాయపడిన తొమ్మిది మందిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఘటన సమయంలో బస్టాండ్ ఎండ్ పాయింట్ వద్ద బస్సును రివర్స్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసు అధిధికారి చెప్పారు. ప్రమాదానికి కారణమైన బస్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఐదు లక్షల సాయం...
రాత్రి 10.05 గంటల సమయంలో బాందుప్ రైల్వే స్టేషన్ బయట ప్రమాదం జరిగింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఈ ఘటనను తీవ్రంగా విచారకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ ఘటనపై విచారణ జరపాలని ముంబయి కాంగ్రెస్ అధ్యక్షురాలు, లోక్‌సభ ఎంపీ వర్షా గైక్వాడ్ డిమాండ్ చేశారు. లోపభూయిష్ట బస్సులు, సరైన శిక్షణ లేని డ్రైవర్లతో ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని ఆమె వ్యాఖ్యానించారు. ఈ బస్పు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బస్సు డ్రైవర్ ను విచారిస్తున్నారు.