హైడ్రా పేరిట బెదిరింపులు - యాభై లక్షలు వసూలు చేసి
హైడ్రా పేరుతో బెదిరింపులకు దిగి యాభై లక్షల రూపాయలు వసూలు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
హైడ్రా పేరుతో బెదిరింపులకు దిగి యాభై లక్షల రూపాయలు వసూలు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. డిజిటల్ మీడియా ప్రతినిధులతో పాటు అడ్వొకేట్ నరేష్ సుంకర బెదరించారని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. డిజిటల్ మీడియా ప్రతినిధితో కలసి హైడ్రా పేరిట బెదిరింపులకు పాల్పడ్డారన్న ఫిర్యాదుపై వారిపై కేసు నమోదు చేశారు. నరేష్ సుంకర, ప్రవీణ్, డిజిటల్ మీడియా ప్రతినిధి ఒకరిపై పోలీసు స్టేషన్ లో హైడ్రా అధికారులు ఫిర్యాదు చేశారు.హైదరాబాద్ - తుక్కుగూడ మునిసిపాలిటీ మంఖాల్ గ్రామం పరిధిలో వర్టెక్స్ అనే కంపెనీ లే అవుట్ వేయగా సూరం చెరువును ఆక్రమించి కొత్తకుంటలో మట్టిపోసి బాక్స్ డ్రైన్ నిర్మించారని ఫిర్యాదు హైడ్రాకు అందింది.
హైడ్రా ఫిర్యాదుతో...
ఈ వ్యవహారంపై డిజిటల్ మీడియా ప్రతినిధి కొన్నిరోజుల కిందట తన యూట్యూబ్ ఛానల్లో హంగామా చేయగా ఫేక్ న్యాయవాదిగా చలామణి అవుతూ ఇటీవల బార్ కౌన్సిల్ నుండి తొలగించిన నరేష్ సుంకర తోడయ్యారు. హైడ్రా నిర్మాణ సంస్థ విచారణ చేపట్టగా వర్టెక్స్ కంపెనీపై రెండు కేసులు నమోదు చేసింది. తమ భూమిని సైతం వర్టెక్స్ సంస్థ ఆక్రమించి రోడ్డు నిర్మించిందని చైతన్యరెడ్డి అనే మహిళ హైడ్రాకు ఫిర్యాదు చేశారు. రోడ్డును తొలగించాలనే ఫిర్యాదుతో ఇరు వర్గాలతో హైడ్రా విచారణ జరుపుతున్న నేపథ్యంలో తమకు హైడ్రా అధికారులు తెలుసని, చైతన్య రెడ్డికి న్యాయం చేస్తామని ఆమె నుంచి వీరు 50 లక్షలు వసూలు చేసినట్లు విచారణలో తేలగా వారిపై హైడ్రా అధికారులు పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కేసు పెట్టారు.