Gold Price Today : బడ్జెట్ ఎఫెక్ట్.. బంగారం ధరలు దిగివస్తాయా? ఈరోజు ధరలు ఎలా ఉన్నాయంటే?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి
బంగారం ధరలు గతంలో ఎన్నడూ లేనంతగా పెరుగుతున్నాయి. వెండి ధరలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. పది గ్రాముల బంగారం ఇప్పటికే 87 వేల రూపాయలకు చేరువలో ఉంది. అలాగే కిలో వెండి లక్ష ఆరువేల రూపాయలుగా నమోదయింది. అయితే బడ్జెట్ వల్ల బంగారం ధరలు కొంత తగ్గే అవకాశముందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే వినియోగదారులు అంచనా వేసినంతగా ధరలు తగ్గవని, అదే సమయంలో పెరగడం కూడా అరుదుగానే జరుగుతుందని చెబుతున్నారు. నిజంగా బంగారాన్ని కొనుగోలు చేసే వారికి ఇది ఒక రకంగా గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే పసిడి పరుగు చూస్తుంటే పది గ్రాములు లక్ష రూపాయలకు ఈ ఏడాది చేరుకుంటుందని అంచనాలకు కొంత బ్రేక్ పడే అవకాశముంది.
గిరాకీ ఎక్కువ కావడంతో...
పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో గిరాకీ కూడా ఎక్కువగానే ఉంది. ఎక్కువ మంది కొనుగోలు చేస్తుండటంతో బంగారం, వెండి వస్తువులకు డిమాండ్ పెరిగింది. ధరలు పెరిగినా సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా కొనుగోళ్లు తప్పనిసరి కావడంతో జ్యుయలరీ దుకాణాలకు క్యూ కడుతున్నారు. పెట్టుబడి పెట్టే వారు మాత్రం ధరలు తగ్గుతాయేమోనని ఎదురు చూస్తున్నారు. అవసరాల కోసం కొనుగోలు చేసే వారు మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో కొనుగోలు చేస్తున్నారు. అందుకే బంగారం ధరలు మరింత పెరుగుతాయని అంచనాలు వినపడుతున్నా కొనుగోళ్లపై మాత్రం ప్రభావం పడటం లేదు. జ్యుయలరీ దుకాణాల యాజమాన్యాలు కూడా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.
కొద్దిగా తగ్గి...
ధరలు తగ్గుతాయనుకుంటే పొరపాటు పడినట్లేనని, బంగారం, వెండి కొనుగోలు చేయాల్సిన వారు ఇప్పుడే కొనుగోలు చేయడం మంచిదన్న సూచనలు వెలువడతున్నాయి. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధర పై వంద రూపాయలు తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 77.440 రూపాయల వద్ద నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 84,480 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,06,000 రూపాయలుగా ఉంది.