Gold Rates Today : రికార్డు బ్రేక్ చేసిన వెండి.. రెండు లక్షలు దాటి.. బంగారం అదే బాటలో
బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. వెండి ధరలు అయితే దూసుకెళుతున్నాయి
బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. వెండి ధరలు అయితే దూసుకెళుతున్నాయి. చాలా మంది అప్పులు చేసి బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఇటీవల కాలంలో బంగారం, వెండి ఆభరణాలకు డిమాండ్ పెరిగిందంటున్నారు. పెరిగిన డిమాండ్ మేరకు దిగుమతులు లేకపోవడంతో ధరలు అదుపు కావడం లేదు. అందులోనూ ఎక్కువ మంది వెండి వస్తువులను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారని బంగారు వర్తకులు చెబుతున్నారు. వెండి కిలో ధర అయితే ఇప్పటికే రెండు లక్షల రూపాయలు దాటింది. పది గ్రాముల బంగారం ధర అయితే లక్షా ముప్ఫయి వేల రూపాయలకు దగ్గరగా ఉంది. ఇంకా ధరలు పెరుగుతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
పెరిగిన కొనుగోళ్లు...
బంగారం, వెండి వస్తువులపై పెట్టుబడి పెడితే త్వరగా లాభాలు గడించవచ్చని ఎక్కువ మంది మదుపరులు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. మొన్నటి వరకూ ధరలు భారీగా తగ్గుతాయేమోనని భయపడిన పెట్టుబడిపెట్టేవారు ఇప్పుడు ఏ మాత్రం సంకోచించడం లేదు.. తగ్గితే స్వల్పంగానే తగ్గుతుందని, బంగారం, వెండి భారీగా పతనమయ్యే అవకాశాలు లేవన్న అంచనాలు వినిపించడంతో జ్యుయలరీ దుకాణాలకు క్యూ కడుతున్నారు. దీంతో బంగారం, వెండి వస్తువులకు గిరాకీ పెరిగింది. అయితే ఈ కొనుగోళ్లు సంపన్న వర్గాలు మాత్రమే చేస్తున్నాయి. మధ్యతరగతి, వేతన జీవుల విషయంలో మాత్రం బంగారం భారంగా మారింది. వెండి దూరమయిందనే చెప్పాలి.
భారీగా పెరిగి...
ఇక పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండటంతో పాటు దీపావళి, ధన్ తెరాస్ వస్తుండటంతో ఇంకా ధరలు పైపైకి వెళతాయని అంటున్నారు. కొనుగోలు చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో దుకాణదారులు కూడా కొత్త కొత్త డిజైన్లు, ఆఫర్లతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. అదే స్థాయిలో వెండి ధరలు కూడా పెరిగాయి. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,17,660 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,28,360 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 2,06,100 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరలు మరింత పెరిగే అవకాశముంది.