Gold Price Today : త్వరలో లక్షకు చేరుకోనున్న బంగారం.. ఎంతో దూరం లేదట
ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి
బంగారం ధరలు అడ్డూ అదుపూ లేకుండా పెరుగుతున్నాయి. దేశంలో ఇంతగా బంగారం ధరలు గతంలో ఎన్నడూ పెరగలేదు. ఇప్పటికే 90 వేల రూపాయలకు చేరువలో ఉంది. కిలో వెండి ధర కూడా లక్ష రూపాయలకు పైగానే పలుకుతుండటంతో కొనుగోలు దారులు కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. బంగారం ధరలు పెరగడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు బంగారం, వెండి ధరల్లో పెరుగుదలకు కారణంగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో డిమాండ్ కూడా అధికంగా ఉండటంతోనే ధరలు పెరిగాయంటున్నారు.
దిగుమతులు లేక...
మరొక వైపు బంగారం దిగుమతులు సరిగా లేకపోవడం, నిల్వలు తగ్గిపోవడంతో ధరలు విపరీతంగా పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ లో ఆశించినంత మేరకు కొనుగోళ్లు లేవని, అంటే డిమాండ్ లేని కూడా చెబుతున్నారు. దాదాపు అరవై శాతం వరకూ కొనుగోళ్లు తగ్గిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇంత పెద్ద మొత్తం వెచ్చించి ధరలు కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో స్టాక్ అలాగే నిలిచిపోయిందని కూడా వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ సమయంలో ఎంత ఆఫర్లు ప్రకటించినా పెరిగిన ధరలను చూసి వినియోగదారులు కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదని వ్యాపారులు చెబుతున్నారు.
వెండి స్థిరంగా...
ఈ స్థాయిలో ధరలు పెరగడం గతంలో ఎన్నడూ లేకపోవడంతో ఈ ఏడాది పది గ్రాముల బంగారం లక్ష రూపాయలకు చేరుకునే అవకాశముంటుందని అంచనాలు వినిపిస్తున్నాయి. ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. పది గ్రాముల బంగరాం ధర పై 390 రూపాయలు పెరిగింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. అయితే ఇది ఆరు గంటలకు వరకూ మాత్రమే ఉన్న ధరలని, మధ్యాహ్నానికి ధరలు పెరగొచ్చు. తగ్గొచ్చు అని చెబుతున్నారు. 22 క్యారెట్ల పది గ్రాముల బంగరాం ధర 80,700 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 88,040 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 1,00,800 రూపాయలుగా ఉంది.