Gold Price Today : రికార్డ్ బ్రేక్ చేసిన బంగారం ధరలు.. లక్షన్నరకు చేరడానికి?

ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి.

Update: 2025-10-02 03:32 GMT

బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ధరలు ఇటీవల కాలంలో పెరుగుతున్నాయి. పండగలు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ధరలు ఎంతగా పెరుగుతున్నాయంటే ఎవరూ కొనుగోలు చేయలేని స్థితికి బంగారం ధరలు ఇప్పటికే చేరుకున్నాయి. ఇక పది గ్రాముల బంగారం ధర లక్షన్నర రూపాయలకు చేరుకునే రోజు దగ్గరలోనే ఉన్నట్లు కనిపిస్తుంది. ఇప్పటికే పది గ్రాముల బంగారం ధర లక్షా ఇరవై వేల రూపాయలకు చేరుకుంది. ఈ నెలలో లక్షన్నర దాటే అవకాశముందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. వెండి ధరలు కూడా అదే స్థాయిలో బంగారానికి పోటీగా పరుగులు పెడుతూనే ఉండటం వినియోగదారులకు షాకిచ్చేలా ఉంది.

పసిడి దూరమై...
బంగారం ధరలు పెరగడానికి అనేక కారణాలున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, దిగుమతులు తగ్గడంతో పాటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల ప్రభావం బంగారం ధరల పెరుగుదలపై పడుతుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. డాలర్ తో పోల్చుకుంటే రూపాయి విలువ క్షీణిస్తుండటం కూడా బంగారం ధర పెరుగుదలకు బలమైన కారణమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇక భవిష్యత్ లో బంగారం కొనుగోలు చేయాలంటే అందరికీ సాధ్యం కాదు. ఇప్పటికే చాలా మందికి పసిడి ,వెండి దూరమయిందన్న కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి.
భారీగా పెరిగి...
పెట్టుబడి దారులు మాత్రం బంగారం సురక్షితమైనదని నమ్మి కొనుగోలు చేస్తున్నారు. ఇంకా ధరలు పెరిగితే లాభాలు వస్తాయని భావించి కొనుగోలు చేస్తున్నారని, లేకుంటే అమ్మకాలపై విపరీతమైన ప్రభావం ఉండేదని జ్యుయలరీ దుకాణ యజమానులు చెబుతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై రెండు వేల రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఉదయం ఆరు గంటలకు నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,09,310 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,19,250 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,60,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులు ఉండే అవకాశాలున్నాయి.


Tags:    

Similar News