Gold Price Today : ఈరోజు కూడా షాకిచ్చిన బంగారం ధరలు.. ఇక పరుగు ఆపేట్లు లేవుగా

బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. వెండి ధరలు కూడా దానితో సమానంగా పరుగులు పెడుతున్నాయి

Update: 2025-03-07 03:41 GMT

బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. వెండి ధరలు కూడా దానితో సమానంగా పరుగులు పెడుతున్నాయి. ఈ రెండు వస్తువులు అతి విలువైనవిగా మారుతున్నాయి. నిజానికి ప్లాటినంకు మించిన ధర బంగారం ధర ఎప్పుడో చేరిపోయింది. ఒకప్పడు బంగారం స్థానంలో ప్లాటినం వాడితే స్టేటస్ సింబల్ గా భావించేవారు. కానీ నేడు ధరలు మరింతగా పెరగడంతో బంగారమే స్టేటస్ సింబల్ గా మారింది. అందుకే డబ్బులు ఎక్కువగా ఉన్న వారు ప్లాటినం ఆభరణాలను పక్కన పెట్టి బంగారాన్ని కొనుగోలు చేయడం మొదలు పెట్టారు. అయితే సామాన్య, మధ్య, పేద తరగతి ప్రజలకు మాత్రం బంగారం ధరలు పెరగడంతో వాటిని కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది.

నిత్యం మార్పులు...
బంగారం, వెండి ధరల్లో నిత్యం మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. అందుకు అంతర్జాతీయ ధరల్లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం వంటి కారణాలతో ప్రతి రోజూ ధరల్లో మార్పులు చేర్పులు ఉంటాయి. ఉదయం ఉన్న ధరలు మధ్యాహ్నానికి ఉండటం లేదు. అలాగే ధరలు పెరుగుదలను చూసిన వినియోగదారులు జ్యుయలరీ దుకాణాలవైపు చూసేందుకు భయపడుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్నప్పటికీ కొనుగోళ్లు అస్సలు జరగడం లేదని, తాము బేరాల్లేక ఈగలు తోలుకుంటున్నామని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ధరలు తగ్గితేనే కొనుగోలు దారులు మళ్లీ షాపులోకి అడుగుపెడతారంటున్నారు.
మళ్లీ పెరిగి...
బంగారం, వెండి ధరలు ఈ ఏడాది ప్రారంభం నుంచి పెరుగుతూనే ఉన్నాయి. జనవరి ఒకటో తేదీన ప్రారంభమైన పెరుగుదల మధ్యలో అప్పుడప్పుడూ కొంత తగ్గినా ఎక్కువ సార్లు ధరలు పెరగడమే జరిగింది. ఈ రెండు నెలల్లోనూ దాదాపు మూడు నుంచి నాలుగు వేల రూపాయల ధర పెరగడంతో వినియోగదారులు కొనుగోలు చేయడానికి జంకుతున్నారు. ఈరోజు ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం , వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 80,190 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 87,480 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 1,04,900 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News