dussehra Sales : దసరాకు దేశంలో ఎంత వ్యాపారం జరిగిందో తెలుసా? పదేళ్ల అమ్మకాల రికార్డు బ్రేక్
దసరాకు వ్యాపారం దేశంలో విపరీతంగా పెరిగింది. భారత్ లో అత్యధికంగా వస్తువుల విక్రయాలు జరిగాయి
దసరాకు వ్యాపారం దేశంలో విపరీతంగా పెరిగింది. భారత్ లో అత్యధికంగా వస్తువుల విక్రయాలు జరిగాయి. అందులోనూ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడంతో అమ్మకాలు ఊపందుకున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా దేశవ్యాప్తంగా 375 వస్తువులపై జీఎస్టీ తగ్గింపుతో వినియోగదారులు షాపులకు క్యూ కట్టారు. అనేక దుకాణాలు, కార్ షోరూములకు వెళ్లి ధరల తగ్గుదలపై ఆరా తీశారు. చాలా మంది ఈ నవరాత్రుల సమయంలో అత్యధికంగా కొనుగోలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. గత పదేళ్లలో నవరాత్రి సమయంలో ఇంత భారీ స్థాయిలో అమ్మకాలు జరగడం ఇదే ప్రధమమని వ్యాపార వర్గాలు చెబుతున్నారు.
ధరలు తగ్గడంతో.. కార్లను...
జీఎస్టీ సంస్కరణలతో ధరలు తగ్గాయి. దీంతో ప్రజలు తమవద్ద ఉన్న కార్లను ఇచ్చేసి ఎక్కువ మంది కొత్త కార్లను కొనుగోలు చేశారంటున్నారు. కార్ల జీవితకాలం పూర్తి కావస్తున్న వారు సయితం ఈ నవరాత్రి సమయంలో కొత్త కార్లను కొనుగోలు చేశారని చెబుతున్నారు. జీఎస్టీ తగ్గింపుతో భారీగా రేట్లలో వ్యత్యాసం కనపడటంతో ప్రజలు కొత్త కార్ల కొనుగోళ్లకు ఉత్సాహం చూపారంటున్నారు. పదిహేనేళ్లకు దగ్గరపడిన కార్లతో పాటు జీవితకాలం పూర్తయి ఫిట్ నెస్ సర్టిఫికేట్ తో నడుస్తున్న వాహనాలను సయితం షోరూంలలో ఇచ్చేసి దానికి కొంత నగదును కూడా పొందారు. కార్ల షోరూంలు కూడా జీఎస్టీ తగ్గింపుతో పాటు భారీ ఆఫర్లు ఇవ్వడంతో కార్ల విక్రయాలు నవరాత్రుల సమయంలో ఎక్కువగా జరిగాయని అన్నారు.
ఎలక్ట్రానిక్ వస్తువులను...
దీంతో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులు, రోజువారీగా వినియోగించే ఉత్పత్తులు, లైఫ్‌స్టైల్ ఉత్పత్తులపై ఖర్చు పెరిగింది. పండుగ ఉత్సాహం రికార్డు స్థాయి వినియోగంగా మారడంతో అత్యథికంగా కొనుగోలు చేశారు. ఫ్రిడ్జ్ లు, టీవీలు, ఏసీలను కూడా కొత్తవి కొనుగోలు చేశారని షోరూం యజమానులు చెబుతున్నారు. సాధారణంగా దీపావళికి కొత్త వస్తువులను కొనుగోలు చేయడం సంప్రదాయంగా వస్తుంది. అయితే ఈసారి దసరా నవరాత్రులకే జీఎస్టీ సంస్కరణలతో ఎక్కువ మంది కొత్త వస్తువుల కొనుగోలుకు ఉత్సాహం చూపారంటున్నారు. దీనివల్ల అమ్మకాలు భారీగా పెరగడంతో పాటు తమ వద్ద ఉన్న స్టాక్ కూడా దసరాకు పూర్తిగా విక్రయించామని ఎలక్ట్రానిక్ షాపు యజమాని ఒకరు చెప్పారు.