YSRCP : ఈ ఇద్దరు ఎమ్మెల్సీలు ఎటువైపు? సస్పెండ్ అయినా వైసీపీలోనేనా?

వైసీపీ అధికారంలో ఉండగా ఎమ్మెల్సీగా ఎన్నికయిన వారు ఇధ్దరు పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు

Update: 2025-10-13 09:04 GMT

వైసీపీ అధికారంలో ఉండగా ఎమ్మెల్సీగా ఎన్నికయిన వారు ఇధ్దరు పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. అయితే వీరిద్దరూ ఏ పార్టీ వైపు ఉన్నారంటే వైసీపీకి మద్దతుదారులుగానే ఉన్నారు. పార్టీ నుంచి సస్పెండ్ అయినప్పటికీ వీరిపై అనర్హత వేటు పడలేదు. దీంతో వీరు సస్పెండ్ అయినా వైసీపీ నేతలుగానే శాసనమండలిలో కొనసాగుతుండటం చర్చనీయాంశమైంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన దువ్వాడ శ్రీనివాస్, తూర్పు గోదావరి జిల్లా అనంతబాబులను గత వైసీపీ హయాంలో ఎమ్మెల్సీ పదవి వరించింది. వారు పార్టీ కోసం చేసిన పనితీరును గమనించి నాడు జగన్ వీరిద్దరికీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. దువ్వాడ శ్రీనివాస్ అయితే టెక్కలి సీటు కూడా కేటాయించారు.

హత్య కేసులో...
అయితే అనంతబాబు తన డ్రైవర్ హత్య కేసులో నిందితుడిగా మారారు. రంపచోడవరంలో పట్టున్న నాయకుడిగా పేరున్న అనంతబాబు డ్రైవర్ హత్య కేసులో నిందితుడిగా మారి కొన్నాళ్ల పాటు జైలులో ఉండి బెయిల్ పై బయటకు వచ్చారు. అయితే డ్రైవర్ ను హత్య చేసి ఇంటికి పార్సిల్ చేశారన్న ఆరోపణలను గతంలో టీడీపీ చేసిన విమర్శలు జనంలోకి వెళ్లాయి. ఈ ఘటన కూడా గత ఎన్నికల్లో వైసీపీ ఓటమికి కారణమయిందని చెప్పాలి. అందుకే వెంటనే వైసీపీ నష్టనివారణ చర్యల్లో భాగంగా అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయితే సస్పెండ్ చేసి ఇన్నేళ్లవుతున్నా పదవి మాత్రం పదిలంగానే ఉంది. దీంతో ఆయన అనధికారికంగా వైసీపీ నేతగానే చలామణి అవుతున్నారు.
టెక్కలి నుంచి పోటీ చేసి...
ఇక మరొకనేత దువ్వాడ శ్రీనివాస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ నేత, ప్రస్తుత మంత్రి అచ్చెన్నాయుడు చేతిలో ఓటమి పాలయ్యారు. తర్వాత దువ్వాడ శ్రీనివాస్ కుటుంబంలో విభేదాలు తలెత్తాయి. దువ్వాడ జీవితంలోకి దివ్వెల మాధురి ఎంట్రీతో ఆయన ఫ్యామిలీ ట్రబుల్స్ లో ఇరుక్కున్నారు. ఈ విషయం మీడియాలో హైలెట్ కావడంతో వెంటనే దువ్వాడ శ్రీనివాస్ ను కూడా వైసీపీ సస్పెండ్ చేసింది. అయితే ఆయన కొన్నాళ్ల నుంచి రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. వ్యాపారాలకు పరిమితమయ్యారు. హైదరాబాద్ లోనే ఎక్కువ సమయం ఉంటున్నారు. ఎమ్మెల్సీ పదవికి మాత్రం రాజీనామా చేయలేదు. అయితే బహిరంగంగా ఇద్దరూ వైసీపీకి మద్దతు పలకపోతున్నప్పటికీ ఇద్దరు ఎమ్మెల్సీలు పరోక్షంగా వైసీపీకి అండగా నిలుస్తుండటం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.


Tags:    

Similar News