వెయ్యేళ్ల చారిత్రక ఆనవాళ్లు కాపాడాలి

నిర్లక్ష్యంలో పొదిలి ఆలయ శిల్పాలు, శాసనాలు పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి అన్న శివనాగిరెడ్డి

Update: 2026-03-14 16:36 GMT

పొదిలి, మార్చి 14: మార్కాపురం జిల్లా పొదిలి మండల కేంద్రంలో ఉన్న నిర్మ మహేశ్వర, వేణుగోపాల, వీరభద్రస్వామి ఆలయాల్లో ఉన్న వెయ్యేళ్ల నాటి శిల్పాలు, శాసనాలను కాపాడాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డా. ఈమని శివనాగిరెడ్డి అన్నారు.

పొదిలికి చెందిన ఉపాధ్యాయుడు డా. షేక్ జి. మస్తాన్ ఇచ్చిన సమాచారం మేరకు ఆయన శనివారం పట్టణంలోని ఆలయాలను సందర్శించారు. నిర్మమహేశ్వరాలయంలో ఉన్న వెయ్యేళ్ల నాటి మహిషాసురమర్దిని విగ్రహం, మూడు నంది విగ్రహాలు వేంగి చాళుక్యుల శిల్ప సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు. వాటిని విడిగా పీఠాలపై ఏర్పాటు చేసి, చారిత్రక వివరాలతో పేరు పలకలు పెట్టాలని ఆలయ అధికారులకు సూచించారు.



 వీరభద్రస్వామి ఆలయంలో సా.శ.1289 నాటి శాసనం, సా.శ.16వ శతాబ్దానికి చెందిన వీరుని శిల్పం నిర్లక్ష్యంగా ఉన్నాయని ఆయన చెప్పారు. వాటిని భద్రపరిచి సంరక్షించాలని కోరారు. పొదిలిలో మిగిలి ఉన్న ఈ చారిత్రక ఆనవాళ్లు ప్రాంత చరిత్రకు గుర్తులని, వాటిని కాపాడి భావితరాలకు అందించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ చరిత్రకారుడు డా. జ్యోతి చంద్రమౌళి, ఆగమపండిట్ బాలాజీ గురుకుల్, శిల్పి వెంకటరెడ్డి పాల్గొన్నారు.

Tags:    

Similar News