10వ శతాబ్ద శివాలయ పునరుద్ధరణకు గ్రామస్తుల నిర్ణయం

సన్నమూరు చారిత్రక ఆనవాళ్లు కాపాడుకోవాలి: శివనాగిరెడ్డి

Update: 2026-03-14 16:30 GMT

శిథిలావస్థలో అగ్రేశ్వర ఆలయం… పునరుద్ధరణకు గ్రామస్థుల ముందడుగు

మర్రిపూడి, మార్చి 14: ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం సన్నమూరు గ్రామ శివారులో ఉన్న సుమారు 10వ శతాబ్దానికి చెందిన అగ్రేశ్వర ఆలయాన్ని పునరుద్ధరించాలని గ్రామస్తులు నిర్ణయించారు. ఈ ఆలయాన్ని సా.శ. 968లో బాణరాజు ఆగ్గప్ప నిర్మించినట్లు పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డా. ఈమన శివనాగిరెడ్డి తెలిపారు.

గ్రామానికి చెందిన పింగళి సూర్యనారాయణ ఆహ్వానం మేరకు శనివారం ఆయన శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని పరిశీలించారు. ఆలయ గర్భగుడిలో శివలింగం దెబ్బతిన్నదని, ద్వారశాఖలు కదిలిపోయాయని, పైకప్పు చెదిరిపోయిందని, శాసనం కూడా కుంగిపోయిందని ఆయన తెలిపారు.

గ్రామస్తులతో కలిసి ఆలయ పరిసరాల్లో పరిశీలించిన సమయంలో ఆలయానికి చెందిన కొన్ని శిల్పావశేషాలు భూమిలో కూరుకుపోయి కనిపించాయని చెప్పారు. తరువాత సన్నమూరమ్మ, పోలేరమ్మ, రాములవారి ఆలయాలను కూడా ఆయన సందర్శించారు.

పోలేరమ్మ విగ్రహం 10వ శతాబ్దానికి చెందినదని, రామాలయంలో ఉన్న వేణుగోపాల స్వామి శిల్పం 16వ శతాబ్దం విజయనగర కాలానికి చెందినదని శివనాగిరెడ్డి వివరించారు. బాణరాజుల కాలం నాటి అగ్రేశ్వర ఆలయాన్ని పునర్నిర్మించి, అక్కడ ఉన్న శిల్పాలు, శాసనాలు కాపాడుకోవాలని గ్రామస్తులకు సూచించారు.

అనంతరం గ్రామస్తులు చర్చించి శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని త్వరలో పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నారని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో మందాల శ్రీనివాసులు, నేరెళ్ల శ్రీను, వెంగయ్య, పింగళి రమేష్ బాబు, లకులు, పీర్ సాయిబు, ఉల్లి శ్రీనివాస్, శ్రీను పాల్గొన్నారు. ప్రముఖ చరిత్రకారులు డా. జ్యోతి చంద్రమౌళి, డా. షేక్ జి. మస్తాన్, ఆగమపండిట్ బాలాజీ గురుకుల్, శిల్పి వెంకటరెడ్డి కూడా హాజరయ్యారు.

Tags:    

Similar News