YSRCP : జగన్ పార్టీకి గ్రౌండ్ లెవెల్ లో క్రేజ్ పెరిగిందా?
వైసీపీకి పదహారు నెలల్లోనూ ఆంధ్రప్రదేశ్ లో కొంత ఊపు కనిపిస్తుందని ఆ పార్టీ నేతలు అంచనా వేసుకుంటున్నారు
వైసీపీ అధినేత జగన్ పార్టీకి కేవలం పదహారు నెలల్లోనూ ఆంధ్రప్రదేశ్ లో కొంత ఊపు కనిపిస్తుందని ఆ పార్టీ నేతలు అంచనా వేసుకుంటున్నారు. అందుకే ఇన్నాళ్లూ బయటకు రాని వారు కూడా ఇప్పుడు వైసీపీకి వచ్చే క్రేజ్ ను చూసి తిరిగి యాక్టివ్ అవుతున్నారు. ఇప్పటి వరకూ వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారం వస్తుందో రాదో అన్న అనుమానంతో ఇంటి గడప దాటని నేతలు కూడా నేడు బయటకు వచ్చి అధికార పార్టీ పై విమర్శలు చేస్తున్నారు. జనం నాడి కొంత తెలియడంతో వారి మనసులు కూడా మారాయంటున్నారు. వైసీపీ అధికారం కోల్పోయిన పదిహేను నెలల నుంచి కనిపించని నేతలు నేడు బయటకు రావడంతో పాటు వైసీపీ ఇచ్చిన కార్యక్రమాలకు కూడా హాజరవుతున్నారు.
నిన్నటి వరూ...
అదే సమయంలో మీడియా సమావేశాలు కూడా పెట్టి అధికార పార్టీపై విమర్శలు చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ గుడివాడ అమర్ నాధ్, పేర్ని నాని, జోగి రమేష్, ఆర్కే రోజా, విడదల రజనీ, బొత్స సత్యనారాయణ వంటి నేతలు మాత్రమే మీడియాలో అధికార పార్టీపై విమర్శలు చేయడానికి ముందుండే వారు. కానీ దూరంగా ఉండే ధర్మాన ప్రసాదరావు వంటి నేతలు కూడా బయటకు వస్తున్నారంటే పార్టీకి కొంత హైప్ కనపడుతుందన్న భావన నేతల్లో వ్యక్తమవుతుంది. కేవలం పదహారు నెలల్లోనే వైసీపీ నేతలు ఇంత యాక్టివ్ అయితే రానున్న కాలంలో మరింతగా బయటకు వచ్చి ప్రజల్లోకి వెళతారన్న అంచనాలో కేంద్ర పార్టీ కార్యాలయం కూడా ఉందన్నది వాస్తవం.
ఒక్కొక్కరుగా బయటకు వస్తూ...
ముఖ్యంగా జగన్ పర్యటనలకు జనం నుంచి మంచి స్పందన రావడంతో పాటు క్యాడర్ కూడా భయం లేకుండా వచ్చి పాల్గొనడంతో ఈ మార్పునకు కారణమని అంటున్నారు. అనేక అంశాలు వైసీపీకి ప్లస్ గా మారాయన్న లెక్కలు వేసుకుంటున్నారు. ప్రధానంగా గుంటూరు మిర్చి రైతులు, పొదిలి పొగాకు రైతులు, బంగారుపాళ్యంలో చిత్తూరు మామిడి రైతుల కోసం వెళ్లిన పర్యటనతో పాటు పల్నాడు పర్యటన, తాజాగా ఉత్తరాంధ్ర పర్యటన కూడా సక్సెస్ కావడంతో ఒక్కొక్కరుగా నేతలు బయటకు వస్తున్నారు. దీంతో పాటు మెడికల్ కళాశాలల ప్రయివేటీకరణ అంశంతో పాటు కల్తీ మద్యం ఘటన కూడా తమకు అనుకూలంగా మారుతుందని అంచనా వేసుకుని మరీ నేతలు బయటకు వస్తున్నారని వైసీపీ కీలక నేత ఒకరు చెప్పారు. మొత్తం మీద రానున్న రోజుల్లో వైసీపీ నేతలు ఇక జనం బాట పట్టే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి.