YSRCP : వైసీపీ అధినేత సంచలన నిర్ణయం తీసుకుంటారా? ఈరోజు రేపు ప్రకటన ఉండనుందా?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు రేపట్లో పార్టీ తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశముందని తెలిసింది.

Update: 2025-08-09 08:49 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు రేపట్లో పార్టీ తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశముందని తెలిసింది. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక ఈ నెల 12వ తేదీన జరగనుంది. రేపటితో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికను ఇటు టీడీపీ, అటు వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కడప జిల్లాలో రెండు చోట్ల ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఒకటి పులివెందుల కాగా, మరొకటి ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నిక. పులివెందుల నియోజకవర్గం జగన్ సొంత నియోజకవర్గం కావడంతో అక్కడ పాగా వేయాలని టీడీపీ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అలాగే తమ స్థానాన్ని నిలబెట్టుకోవాలని వైసీపీ కూడా అంతే స్థాయిలో శ్రమిస్తుంది.

పోటా పోటీగా...
రెండు పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. పులివెందుల నుంచి వైసీపీ అభ్యర్థిగా దివంగత మహేశ్వర్ రెడ్డి కుమారుడు బరిలో ఉండగా, టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి పోటీలో ఉన్నారు. ప్రచారం ఇరు పార్టీలో జోరుగా కొనసాగిస్తున్నాయి. టీడీపీ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారంలో పాల్గొంటున్నారు. వైసీపీ నుంచి అవినాష్ రెడ్డి, సతీష్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు కూడా తమకు శక్తికి మించి గెలుపొందేందుకు పోరాడుతున్నారు. అయితే అధికార బలం ఉపయోగించి టీడీపీ తమపై అక్రమ కేసులు పెడుతుందని, తమ నాయకులను కొట్టి తమపైనే కేసులు పెడుతుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
అధికార యంత్రాంగం సహకరించకపోవడంతో...
కానీ అదే సమయంలో ఎన్నిక సజావుగా జరిగేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అన్ని చర్యలు తీసుకుంటుందని, అందులో ప్రభుత్వ జోక్యం ఉండదని టీడీపీ నేతలు అంటున్నారు. అయితే అనేక గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంపై వైసీపీ అభ్యంతరం తెలుపుతుంది. మొత్తం 10 వేలకు పైగా ఉన్న ఓటర్లలో దాదాపు చాలా ఓటర్లు నాలుగు కిలోమీటర్ల దూరంలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడాన్ని తప్పుపడుతుంది. ఎన్నికల కమిషన్ ను కూడా కలిసింది. కేవలం రిగ్గింగ్ చేసుకోవడానికే ఇటువంటి చర్యలకు అధికార పార్టీ పాల్పడుతుందని వైసీపీ ఆరోపిస్తుంది. ఎన్నికల కమిషన్ ను కలిసినా అదే గ్రామంలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరినా స్పందిచడం లేదని వైసీపీ నేతలు అంటున్నారు.
ఈ నెల 12వ తేదీన ఎన్నిక...
ఈ నేపథ్యంలో పులివెందుల ఉప ఎన్నిక బరి నుంచి వైసీపీ తప్పుకుంటుందన్న ప్రచారం జరుగుతుంది. ఎన్నికలు జరగడానికి అంటే ఈ నెల 12వ తేదీన పోలింగ్ కావడంతో ముందుగానే ఎన్నికను బాయ్ కాట్ చేయాలన్న నిర్ణయానికి వైసీపీ నేతలు వచ్చినట్లు వైసీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఎందుకంటే సహజంగా అధికార పార్టీ అన్ని రకాలుగా తమపై ఆధిపత్యం ప్రదర్శించే అవకాశముంటుందని, పోలీసులు, ఎన్నికల అధికారులు అధికార పార్టీకే సహకరించే అవకాశాలున్న పరిస్థితుల్లో తాము ఎన్నిక నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పేందుకు వైసీపీ నేతలు సిద్ధమవుతున్నారు. అప్పుడు ఎన్నిక జరిగినా తాము పోటీ చేయలేదని చెప్పుకోవడానికి అవకాశం దక్కుతుందన్నది వారి ఆలోచన. జగన్ పరువు కూడా నిలబడుతుందని బాయ్ కాట్ ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి.




Tags:    

Similar News