తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారం కూడా భక్తుల రద్దీ ఎక్కవగానే ఉంది. గత వారం మొదలయిన తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది. భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో మాడ వీధులన్నీ గోవింద నామస్మరణలతో మారుమోగిపోతున్నాయి. అన్ని చోట్ల రద్దీ కనిపిస్తుంది. లడ్డూల కేంద్రాల వద్ద, అన్నదాన కేంద్రం వద్ద భక్తుల రద్దీ కొనసాగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
నేడు దర్శనం టిక్కెట్లను...
ఈరోజు ఆన్ లైన్ లో తిరుమల దర్శనం టిక్కెట్లను విడుదల చేయనున్నారు. జూన్ నెల కోటాకు సంబంధించిన దర్శన టిక్కెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఉదయం పది గంటలకు వయో వృద్ధులకు సంబంధించిన టిక్కెట్లను విడుదల చేస్తారు. దివ్యాంగుల టిక్కెట్లను కూడా విడుదల చేస్తారు. ఉదయం పదకొండు గంటలకు శ్రీవాణి దర్శనం టిక్కెట్లను విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు అంగప్రదిక్షణం దర్శన టిక్కెట్లను ఆన్ లైన్ లో విడుదల చేస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
శిలా తోరణం వరకూ...
ఈరోజు తిరుమలలోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట శిలా తోరణం వరకూ భక్తుల క్యూ లైన్ విస్తరించింది. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఆరు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 86,091 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 29,664 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.21 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.