నా కుమారుడు నిర్దోషి : పుట్టా సుధాకర్ యాదవ్

‎‎తన కుమారుడు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తీవ్రంగా ఖండించారు.

Update: 2026-03-23 12:15 GMT

‎‎తన కుమారుడు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. సోమవారం మైదుకూరులో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ మాట్లాడారు. అనూహ్యంగా తన కుమారుడిపై వచ్చిన ఆరోపణల తాలూకు తీవ్ర దిగ్బ్రాంతి నుంచి తన కుటుంబం ఇంకా తేరుకోలేదన్నారు. తన కుమారుడు నూరు శాతం తప్పు చేయలేదన్న సుధాకర్ యాదవ్, డ్రగ్స్ సహా ఎటువంటి దురలవాట్లు తన కుమారుడికి లేవని స్పష్టం చేశారు. ఒక డిన్నర్ పార్టీకి వచ్చిన ఆహ్వానం మేరకు అక్కడకు వెళ్లిన తన కుమారుడు అక్కడి పరిస్థితి గమనించి బయటకు వచ్చేసే లోపే ఈగల్ టీమ్ పోలీసులు వచ్చి డ్రగ్స్ చెకింగ్ చేయాలని చెప్పి పోలీసుల సమక్షంలోనే యూరిన్ శాంపిల్ తీసుకున్నారని, 10 నిమిషాల తర్వాత పుట్టా మహేష్ కుమార్ కి నెగెటివ్ వచ్చిందని ఐదుగురికి మాత్రం పాజిటివ్ వచ్చిందని చెప్పడం ప్రజలంతా చూసారన్నారు. కొద్దిసేపటి తర్వాత మరోసారి శాంపిల్ తీసుకోవాలని చెబుతూ ఎర్రగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళి మళ్ళీ యూరిన్ శాంపిల్స్ మాత్రమే తీసుకున్నారన్నారు.

నమూనాలు తీసుకున్న ఐదు గంటల తర్వాత...
శాంపిల్స్ తీసుకున్న ఐదు గంటల తర్వాత ఎస్పీ మీడియా ముందుకు వచ్చి, బ్లడ్ శాంపిల్స్ లో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు పాజిటివ్ వచ్చిందని విచిత్రంగా ప్రకటించడం చూస్తే, దీని వెనుక కుట్ర కోణం వంటిది ఏదో ఉందని తెలిసిపోతోందన్నారు. బ్లడ్ శాంపిలే తీసుకోకుండా, బ్లడ్ రిపోర్ట్ పాజిటివ్ గా వచ్చిందని ఏవిధంగా నిర్ధారించారో పోలీసులే చెప్పాలన్నారు. మొదటిసారి తీసిన యూరిన్ రిపోర్ట్ 10 నిమిషాల్లోనే బయటపెట్టగా, రెండో సారి తీసుకున్న యూరిన్ శాంపిల్ రిపోర్టు ఐదు గంటల తర్వాత బయటపెట్టడం కూడా అనుమానాస్పదంగా ఉందన్నారు. ఈ సందర్బంగా, తన కుమారుడు, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు 2021వ సంవత్సరంలో హార్ట్ సర్జరీ చేసి స్టంట్ వేసిన విషయాన్ని ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ మీడియాకు వివరించారు. ఆ సమయంలో డాక్టర్ హార్ట్ లో కొన్ని వెజల్స్ వీక్ గా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలని సలహా ఇచ్చారు. హార్ట్ పల్స్ 120 దాటకుండా చూసుకోవాలని, 120 దాటితే ప్రాణానికే ప్రమాదం అని డాక్టర్ చెప్పారన్నారు. దానిప్రకారంగా ఇప్పటివరకు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ, ప్రతి 3 నెలలకోసారి అన్ని ఆరోగ్య టెస్ట్ లు చేసుకుంటూ డాక్టర్స్ సలహాలు, సూచనలు పాటిస్తున్నారన్నారు.
Tags:    

Similar News