Ys Jagan : ఏపీ రాజకీయాల్లో కలకలం: వైసీపీ లోకి వచ్చే నేతల లిస్ట్ బయటకు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ లోకి నేతల చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారా? అంటే అవుననే అంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల సంఖ్య పెరగనున్నాయి. ప్రస్తుతమున్న 175 నియోజకవర్గాల నుంచి 225 నియోజకవర్గాలకు అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరగనుంది. అయితే ఈసారి ఎన్నికల్లో బలమైన నేతలను బరిలోకి దించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో మాదిరిగా తన ఫొటోను నమ్ముకుని ఎన్నికలకు వెళితే బొక్కా బోర్లాపడతామని ఆయన భావిస్తున్నారు. కేవలం అభ్యర్థుల ఎంపికతోనే విజయం సాధ్యమవుతుందని ఆయనకు సీనియర్ నేతలకు సూచనలు ఇచ్చినట్లు తెలిసింది. దీంతో ఆయన తన నిర్ణయాన్ని పునస్సమీక్షించుకోవడానికి రెడీ అయిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.
అసంతృప్తితో ఉన్న నేతలు...
ఎన్నికలు దగ్గర పడే సమయంలో ఇతర పార్టీల నుంచి నేతల రాక మొదలవుతుంది. సహజంగానే అధికార పార్టీపై ఉన్న అసంతృప్తి నేతలతో పాటు టిక్కెట్ దక్కదని భావించిన వారు కూడా వైసీపీ వైపు చూసే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ లేదా జనసేన, లేకుంటే వైసీపీ తప్ప మరొక ప్రత్యామ్నాయం లేదు. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ అందులో చేరి ఎవరూ చేతులు కాల్చుకోవడానికి సిద్ధంగా ఉండరు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో దాదాపు మాయమయిపోయింది. నేతలు కొద్దో గొప్పో ఉన్నా పార్టీ సిద్ధాంతాలను నమ్మి ఉన్న వారు కొందరయితే, కేంద్రంలో అధికారంలోకి వస్తే తమకు పదవులు వస్తాయని భావించే వారు మాత్రమే కొనసాగుతున్నారు.
ఇతర పార్టీల నుంచి వచ్చే...
అందుకే టీడీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీల నుంచి వచ్చే నేతలను వైసీపీ లో చేర్చుకోవడానికి సిద్ధమవుతున్నారని తెలిసింది. తన జిల్లాల పర్యటనలో స్థానికనాయకత్వానికి కూడా ఈ మేరకు సంకేతాలు అందచేస్తున్నారు. ఇటీవల జరిగిన పలు సమావేశాల్లోనూ నేతలకు కొత్త నేతలు, పార్టీకిఉపయోగపడే వారు, వారి చేరికతో బలం పెరుగుతుందని భావిస్తే ఖచ్చితంగా చేర్చుకునే అవకాశాలను పరిశీలిస్తామని చెప్పారు. అటువంటి నేతల జాబితాను తయారు చేయాలని కూడా ఇటీవల జరిగిన రాష్ట్ర యువజన విభాగం నేతలతో సమావేశమయిన జగన్ ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు. సామాజికవర్గ పరంగా బలమైన నేతలు వస్తే , చేర్చుకోవడానికి సిద్ధమని ప్రకటించారు.
పార్టీని వీడి వెళ్లిన నేతలు...
అయితే ఇప్పటి వరకూ పార్టీని వీడి వెళ్లిన నేతల విషయంలో మాత్రం జగన్ మనసు మారలేదని తెలిసింది. పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత కొందరు నేతలు పార్టీని వీడి వెళ్లారు. అనేక నియోజకవర్గాల్లో నేతలు తాను గతంలో ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ వారు కష్టకాలంలో వదిలేసివెళ్లిపోయారు. కొందరు సీనియర్ నేతలు మాత్రం వారిని కూడా చేర్చుకునే విషయంలో పునరాలోచించాలని సీనియర్ నేతలు కోరగా, అందుకు జగన్ పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలిసింది. పార్టీని వీడి వెళ్లినవారు ఎంత పెద్దవారైనా, బలవంతులైనా, తన బంధువులైనా సరే తిరిగి తన వద్దకు తీసుకు రావద్దని కూడా నేతలకు సూచించినట్లు తెలిసింది. అలా చేస్తే కార్యకర్తలకు తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.